త్రిషపై తమిళ తంబీల ఆగ్రహం రోజు రోజుకీ పెరిగిపోతోంది. జల్లికట్టుకు వ్యతిరేకంగా ట్విట్టర్లో త్రిష స్పందించడం, దానిపై నిరసనలు వ్యక్తం అవ్వడం, త్రిష చనిపోయిందంటూ ప్రచారం చేయడం ఇవన్నీచూస్తూనే ఉన్నాం. నా ట్విట్టర్ ఎకౌంట్ హ్యాక్ అయ్యిందంటూ… త్రిష ప్లేటు ఫిరాయించినా ఉపయోగం లేకుండా పోయింది. తాజాగా కొంతమంది ఆందోళన కారులు చెన్నైలోని త్రిష ఇంటి ముందు గొడవకు దిగడంతో అక్కడ ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ముందు జాగ్రత్త చర్యగా అక్కడ కొంతమంది పోలీసుల్ని కూడా రంగంలోకి దించింది. ఇప్పుడు త్రిష తల్లి ఉమా కృష్ణన్ రంగంలోకి దిగింది. తన కూతురినీ, తనకూ ప్రాణ హాని జరిగే అవకాశాలున్నాయని, రక్షణ కల్పించమని చెన్నై పోలీస్ కమీషనర్ని ఆశ్రయించింది. ఆమె ఫిర్యాదుని పోలీసులు కూడా స్వీకరించారు. భద్రత విషయంలో హామీ ఇచ్చారు.
తమిళ తంబీలు తమ ప్రాంతానికీ, ఆచార వ్యవహారాలకు, సంప్రదాయాలకు, భాషకూ విలువ ఇచ్చే మనస్తత్వం ఉన్నవాళ్లు. తమ ప్రాంతియాభిమానం ముందు ఏదైనా దిగదుడుపే. అందుకే రజనీకాంత్ లాంటి స్టార్ హీరో కూడా చెన్నై ప్రజల సెంటిమెంట్ జోలికి ఎప్పుడూ వెళ్లలేదు. ఆఖరికి జల్లి కట్టుని కూడా సమర్థించాల్సివచ్చింది. శింభులాంటి ఫాలోయింగ్ ఉన్న హీరోలు చెన్నై ప్రజల తరపునే మాట్లాడుతున్నారు. కానీ ఈ విషయంలో త్రిష తొందర పడింది. అందుకు తగిన మూల్యం చెల్లించుకొంటోంది. కాకపోతే ఈ మొత్తం వ్యవహారం త్రిషకు ఓ చేదు పాఠం. త్రిష లాంటి స్టార్లు.. ఇలాంటి సున్నితమైన విషయాల్లో జోక్యం చేసుకొనేటప్పుడు కాస్త ముందూ వెనుకా ఆలోచించుకోవడం తప్పని సరి.