’96’ రీమేక్ పై దిల్‌రాజు గట్టిగా దృష్టి పెట్టారు. ఈ సినిమాని తెలుగులో అర్జెంటుగా రీమేక్ చేయాలన్నది ఆయన ప్లాన్. తమిళంలో విజయ్ సేతుపతి – త్రిష జంటగా నటించిన చిత్రమిది. అక్కడ… సంచలన విజయం సాధించింది. తెలుగు హక్కుల్ని దిల్‌రాజు చేజిక్కించుకున్నారు. నాని, అల్లు అర్జున్ లాంటి కథానాయకుల పేర్లు పరిశీలనలోకి వచ్చాయి. చివరకు…. గోపీచంద్ దగ్గర ఆ అన్వేషణ ఆగింది. 96 రీమేక్‌లో నటించడానికి గోపీచంద్ అంగీకారం తెలిపినట్టు సమాచారం. కథానాయికగా మళ్లీ త్రిషనే తీసుకురావాలని భావిస్తున్నార్ట. `96`లో త్రిష చాలా సహజంగా నటించింది. ఆమె నటన… విజయ్ సేతుపతితో పండిన కెమిస్ట్రీ… ఈ సినిమాని నిలబెట్టాయి. త్రిషలా మ్యాజిక్ చేసే కథానాయిక.. తెలుగులో కనిపించకపోవడంతో మళ్లీ ఈ పాత్ర కోసం త్రిషనే సంప్రదిస్తున్నట్టు తెలుస్తోంది. కాకపోతే.. తెలుగులో త్రిష మార్కెట్ మరీ దారుణంగా ఉంది. త్రిషని దాదాపుగా ఫేడవుట్ అయిన కథానాయికల జాబితాలో కలిపేశారంతా. ఈమధ్య త్రిష చేసిన సినిమాలేవీ వర్కవుట్ అవ్వలేదు. డబ్బింగ్రూపంలో వచ్చిన సినిమాల్నీ అస్సలు ఆదరించలేదు. ఈనేపథ్యంలో త్రిష ఎంపిక మార్కెట్ పరంగా.. ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తుంది? అనే ఆలోచనలో ఉన్నారు దిల్‌రాజు. మరోవైపు గోపీచంద్‌కీ సరైన విజయాలు లేవు. ఫ్లాప్ బాటలో ఉన్న ఇద్దర్ని పెట్టుకుంటే… ఈ సినిమా ఎలా క్రేజ్తెచ్చుకుంటుంది? అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కాకపోతే… దిల్‌రాజు లాంటి వ్యక్తులు కథని మాత్రమే నమ్ముతారు. 96 కథపై దిల్‌రాజుకి అపారమైన నమ్మకం. స్టార్స్ ఎవరూ లేకపోవడంతో.. అందుబాటులో ఉన్న తారలతో ఈ రీమేక్ పూర్తి చేయాలని చూస్తున్నారు. మరి చివరకు ఏం జరుగుతుందో చూడాలి.