హారర్ థ్రిల్లర్ చిత్రాలకు గిరాకీ బాగా తగ్గిపోయింది. రొటీన్ కథలతో, బ్యాక్ గ్రౌండ్ స్కోర్లతో భయపెట్టాలని విఫలయత్నం చేస్తున్నారు దర్శక నిర్మాతలు. వాటిని అదే స్థాయిలో ప్రేక్షకులూ తిప్పి కొడుతున్నారు. అయితే హారర్ సినిమాల సంఖ్య మాత్రం తగ్గడం లేదు. ఇది వరకు ‘నాయకి’ సినిమాతో భయపెట్టాలని చూసింది త్రిష. ఇప్పుడు `మోహినీ` అవతారం ఎత్తింది. రమణ మాదేష్ దర్శకత్వం వహించిన తమిళ చిత్రమిది. 2017 డిసెంబరులోనే అక్కడ విడుదలైపోయింది. ఇప్పుడు కాస్త లేటుగా తెలుగులోకి తీసుకొస్తున్నారు. అందుకు సంబంధించిన ట్రైలర్ ఇప్పుడు విడుదలైంది. ఇదో ఆత్మకథ. ఓ హత్య జరుగుతుంది. ఆ శవాన్ని ఎవరికీ కనిపించకుండా ఎక్కడో సముద్రపు అడుగున దాచేస్తారు. ఆ శవం, ఆ కేసు రెండూ క్లోజ్ అయిపోతాయి. అయితే… ఆ ఆత్మ మాత్రం అక్కడక్కడే తిరుగుతుంటుంది. ఆ ఆత్మ ఎవరి శరీరంలో ప్రవేశించింది? తన పగ, ప్రతీకారం ఎలా తీర్చుకుంది? అనేదే ‘మోహిని’ కథ. ఆ ఆత్మగా త్రిష కనిపించబోతోంది. లండన్ నేపథ్యంలో తెరకెక్కించిన సినిమా ఇది. కాబట్టి కథ మారకపోయినా, నేపథ్యమైనా మారే ఛాన్స్ దొరికింది. విజువల్స్, గ్రాఫిక్స్ రెండూ భారీగానే ఉన్నాయి. త్రిష అందంగా కనిపిస్తోంది. మరోవైపు భయపెడుతోంది. ఈమధ్య హారర్ సినిమాలకు అంతగా ఆదరణ దక్కడం లేదు. ఈ దశలో తమిళంలో ఏమాత్రం ప్రభావం చూపించని ఈ ‘మోహిని’ తెలుగు ప్రేక్షకుల్ని ఏమాత్రం ఆకట్టుకుంటుందో చూడాలి.