అ.ఆ సినిమా కథ గురించి ఎప్పట్నుంచో ఓ గాసిప్ తిరుగుతూ వచ్చింది. అప్పట్లో వచ్చిన మీనా నవల ఆధారంగా ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారని చెప్పుకొన్నారు. ఆ నవలనే విజయ నిర్మల అదే పేరుతో ఓ సినిమా కూడా తీశారు. ఇప్పుడు మళ్లీ త్రివిక్రమ్ అదే పాయింట్‌ని ఎంచుకోవడం ఆశ్చర్యం కలిగించింది. త్రివిక్రమ్ స్వతహాగా రచయిత కదా, పాత కథని ఎందుకు ఎంచుకొంటాడు అనుకొన్నారు. తీరా అ.ఆ చూస్తే.. మీనా కథే తెరపై దర్శనమిచ్చింది. మీనా కూడా అంతే. అన్నాచెళ్లెళ్ల కథ. మీనా ఏ థ్రెడ్‌పై సాగిందో.. అదే థ్రెడ్‌పై అ.ఆ నడిచింది. అత్త, బావ, మరదలు, పాలేరు.. ఈ తరహా పాత్రలకు మీనా నవలే మూలం అనిపిస్తుంది. కాకపోతే.. కొన్ని క్యారెక్టర్లు అదనంగా నడిచాయి. త్రివిక్రమ్ స్టైల్ కనిపించింది.
అయితే త్రివిక్రమ్ ఈ విషయాన్ని ఎందుకు దాచిపెట్టినట్టు? ముందే మీనా నవల ఆధారంగా తీస్తున్న సినిమా అని చెప్పొచ్చుగా. అలా చెబితే ఈ సినిమాపై ఎక్కడ జనాలకు ముందే హింట్ ఇచ్చినట్టు అవుతుందేమో అని త్రివిక్రమ్ భయపడి ఉంటాడు. ఇప్పుడు మాత్రం మీడియా వదలుతుందా, మీనాని మళ్లీ ఎందుకు తీశారు? అని అడగరూ. మరి ఈసారి ఆయన ఏం సమాధానం చెబుతాడో?