ఇప్పుడు పరిస్థితి మారింది కానీ ఒకప్పుడు రచయిత అనే ముద్ర పడిన తర్వాత ఇక దర్శకుడయ్యే అవకాశాలు పూర్తిగా తగ్గిపోతాయి. రైటర్ గానే కెరీర్ ముగిసిపోతుంది. అందుకే అప్పట్లో దర్శకుడు కావాలని వచ్చిన చాలా మంది రాసేవారు కానీ క్రెడిట్ తీసుకునేవారు కాదు. త్రివిక్రమ్ శ్రీనివాస్ లో కూడా ఈ భయం వుండేది.
త్రివిక్రమ్ డైరెక్టర్ కావాలని పరిశ్రమలోకి వచ్చారు. పోసాని దగ్గర రాసేవారు. కానీ క్రెడిట్ తీసుకునేవారు కాదు. త్రివిక్రమ్ పూర్తి స్థాయిలో రాసిన సినిమా స్వయంవరం. విజయ్ భాస్కర్ దర్శకుడు. ఈ సినిమా మొత్తం పూర్తయింది. రైటర్ గా శ్రీనివాస్ (అప్పటికి త్రివిక్రమ్ కాదు) పేరుని క్రెడిట్ కోసం ఇచ్చారట డైరెక్టర్ విజయ్ భాస్కర్. దీనికి త్రివిక్రమ్ ఒప్పుకోలేదు. ‘దర్శకుడిగా అవకాశాలు రావు. రచయితగా పేరు వద్దులే’అని చెప్పారట. ‘బాగా రాశావ్. మాటల్లో స్పార్క్ వుంది. ఖచ్చితంగా పేలుతాయి. తర్వాత బాధపడతావు’ అని సముదాయించారట భాస్కర్. దీంతో కొంత సమయం తీసుకొని అలోచించి తన సెంటిమెంట్ మూడు అంకెవచ్చేలా ‘త్రివిక్రమ్’ పేరుని క్రిడెట్ కోసం ఇచ్చారట. ఈ విషయాన్ని స్వయంగా విజయ్ భాస్కర్ తాజాగా ఇచిన ఓ ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చారు.
స్వయంవరం తర్వాత విజయ్ భాస్కర్, త్రివిక్రమ్ జోడి సక్సెస్ ఫుల్ గా సాగింది. వీరి కాంబినేషన్ లో వచ్చిన నువ్వునాకు నచ్చావ్, మల్లీశ్వరి, మన్మధుడు చిత్రాలు ప్రేక్షకులని విశేషంగా అలరించాయి. త్రివిక్రమ్ దర్శకుడిగా సక్సెస్ అయిన తరవాత.. విజయ్ భాస్కర్ మరో రైటర్ని వెదుక్కోవాల్సివచ్చింది. కానీ… ఆయా సినిమాలు అస్సలు ఆడలేదు. త్రివిక్రమ్ లేని లోటు.. స్పష్టంగా కనిపించింది.