సాధారణంగా డైరక్టర్ త్రివిక్రమ్ లాంటి వాళ్లు పబ్లిక్ ఫంక్షన్స్ కు ఎక్కువగా రారు. అందునా చీఫ్ గెస్ట్ లుగా మరీ తక్కువ. ఎందుకంటే ఇలా వస్తే స్వడబ్బా..పరడబ్బా..పరస్పర డబ్బా అనే వ్యవహారాలు ఎక్కువ వుంటాయి. నీ భుజం నేను నొక్కుతా..నా భుజం నువ్వు నొక్కు అన్న టైపు అన్నమాట. పవన్ కళ్యాణ్ పంక్షన్ లు ఎలాగూ తప్పవు త్రివిక్రమ్ కు. మిగిలినవి అవాడయిడ్ చేస్తుంటారు.
అలాంటిది అల్లు శిరీష్ నటించిన చిన్న సినిమా ఎబిసిడి కి గెస్ట్ గా వచ్చారు. దీని వెనుక ఏం జరిగి వుంటుందో ఊహించడం పెద్ద విషయం కాదు. ప్రస్తుతం బన్నీ హీరోగా సినిమా చేస్తున్నారు త్రివిక్రమ్. ఇక శిరీష్ ఎవరు అన్నది కొత్త విషయం కాదు. ఈ లింక్ కాకపోతే, మధుర శ్రీధర్ కోసం త్రివిక్రమ్ వచ్చారని అనుకోవడానికి ఏ కోసానా ఆస్కారం లేదు. కాకపోతే విజయ్ దేవరకొండ తో సినిమా చేయాలని త్రివిక్రమ్ అనుకుంటున్నారు. విజయ్ సన్నిహిత బంధవు కాబట్టి మరో నిర్మాత యాష్ రంగినేని కొసం కూడా వచ్చి వుండొచ్చు.
ఏమైనా మొహమాటానికి వచ్చిన త్రివిక్రమ్ స్పీచ్ మాత్రం భలేగా వుంది. తాను భరత్ కు ఫ్యాన్ అని, సినిమాలను విపరీతంగా అర్థం చేసుకున్న కొద్ది మందిలో శిరీష్ ఒకరని, సినిమాలు తీసే విధానం, చూసే విధానం మారాలంటే మధుర శ్రీధర్ లాంటి వాళ్లు సినిమాలు తీస్తూనే వుండాలని ఆయన అన్నారు. చివర్న తన మార్కు చమక్కు ఒకటి పడేసారు.
సినిమాలో హీరోకి కన్ఫ్యూజన్ వున్నా జనాలు మాత్రం కన్ఫ్యూజ్ కాకుండా చూడమని.