మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ గురించి ఏం చెప్పగలం? ఆయన సినిమాకెళ్తే… రెండుగన్న గంటల సినిమాలో జీవితానికి సరిపడినంత మాటలు మచ్చట్లని మూటగట్టి ఇంటికి పంపిస్తాడు. మైకు పట్టుకుంటే… టికెట్టు కొనే అవసరం లేకుండానే కావల్సినన్ని ఛమక్కులు జేబులో వేసి నింపుకోవొచ్చు. అందుకే… త్రివిక్రమ్ మైకు ఎప్పుడు పట్టుకుంటాడా? అని ఆయన అభిమానులు ఎదురుచూస్తుంటారు. ఈమధ్య పవన్ కల్యాణ్‌ని ఆకాశానికి ఎత్తేస్తూ స్పీచులు దంచి కొట్టిన త్రివిక్రమ్ ఈసారి యూ టర్న్ తీసుకుని చిరంజీవి దగ్గర ఆగారు. ‘వినయ విధేయ రామ’ ఆడియో ఫంక్షన్‌కి అతిథిగా వచ్చిన త్రివిక్రమ్ చిరంజీవిపై తనకున్న అభిమానాన్ని, తనదైన శైలిలో మాటలుగా మలిచాడు. చిరు ఫ్యాన్స్‌ని కేరింతలు కొట్టించాడు. ఇంతకీ చిరు గురించి త్రివిక్రమ్ ఏమన్నాడంటే…
”ఓ కోటలోపల స్వర్గం ఉంటుంది. దానికి వెళ్లే మార్గం చాలా కఠినంగా ఉంటుంది. అయితే…అయితే ఆ కోటలో వెళ్లడానికి విలాసవంతమైన మార్గం వేసి, ఓ స్వర్గం సృష్టించిన కథానాయకుడు చిరంజీవి. ఆయన కుటుంబం తెలుగవారందరికీ అభిమాన కుటుంబం అయిపోయింది. ఆయన తమ్మడు మనందరికీ ఆత్మీయుడు అయిపోయాడు. ఆయన తనయుడు మనింట్లో మనిషైపోయాడు. కొద్ది మంది కోసం ఎన్నిసార్లు మాట్లాడినా మాటలు వెదుక్కోవాల్సిన పనిలేదు. అలాంటి నా అభిమాన కథానాయకుడు చిరంజీవి. రామాయణం గురించి దాదాపు మూడొందల వెర్షన్లున్నాయి. ఎన్నిసార్లు చదువుకున్నా… ఏమాత్రం బోర్ కొట్టదు. ఆయన ప్రస్తావన లేకుండా సౌత్ ఇండియా సినిమా గురించి చర్చిలేం. ఇప్పుడు మల్టీప్లెక్సులు వచ్చేశాయి కాబట్టి.. నాకు తెలిసి ఆయనే చిట్టచివరి మాట్నీ ఐడల్. ఆయన కోసం సినిమాకెళ్లి, థియేటర్ ముందు క్యూలో నిలబడితే చమటతో చొక్కాలు చిరిగిపోయిన రోజులు గుర్తున్నాయి. ఎంత కష్టపడి థియేటర్లోకి వెళ్లినా… తన డాన్సులతో, నవ్వులతో మనకు కావల్సిన ఎంటర్టైన్మెంట్ ఇచ్చేస్తారు. మందు కొట్టి పడిపోవడం కంటే, డ్రగ్స్ లో మునిగి తేలడం కంటే.. థియేటర్‌కి వెళ్లి కూర్చోవడం ఎంతో మేలు. ఓ హీరోని చూసి స్ఫూర్తి తెచ్చుకోవొచ్చు. ఓ సామన్యమైన మధ్యతరగతి కుటుంబంలోంచి వచ్చి, ఆయన ఎదిగిన తీరు చూసి చాలా స్ఫూర్తి పొందా. కానిస్టేబుల్ ఇంటి నుంచి వచ్చిన ఓ వ్యక్తి అంత గొప్ప స్థాయిలో ఉంటే.. రైతు కుటుంబంలోంచి వచ్చిన నేను కూడా అదే స్థాయికి వెళ్లగలను కదా.. అనుకునే ఈ పరిశ్రమలోకి వచ్చా” అంటూ చిరుపై తన అభిమానాన్ని కురిపించాడు.
దేవిశ్రీ పేరు ప్రస్తావించని త్రివిక్రమ్
వినయ విధేయ రామ ప్రీ రిలీజ్ ఫంక్షన్ కి దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ హాజరయ్యారు. పేరుకి ప్రీ రిలీజ్ ఫంక్షన్ అయినా ఇది దాదాపు ఆడియో ఫంక్షన్ లాగానే సాగుతుందనేది తెలిసిన విషయమే. ఈ ఫంక్షన్లలో సంగీత దర్శకుడు, అతని సంగీతం ప్రధానమైన హైలెట్ గా ఉంటుంది. అయితే దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కావాలని చేశాడో లేక మరచిపోయాడో తెలియదు కానీ సినిమా సంగీత దర్శకుడైన దేవి శ్రీ ప్రసాద్ ని తన స్పీచ్ లో ఎక్కడా ప్రస్తావించలేదు.
గతంలో జల్సా, అత్తారింటికి దారేది వంటి సినిమాలకు దేవిశ్రీప్రసాద్ తో పని చేసిన త్రివిక్రమ్ ఇటీవలి కాలంలో దేవిశ్రీ తో పనిచేయడం లేదు. అఆ సినిమాకి మిక్కీ జె మేయర్, అజ్ఞాతవాసికి అనిరుద్, అరవింద సమేత కి తమన్ లని సంగీత దర్శకుడిగా తీసుకున్నాడు త్రివిక్రమ్. చిన్న సినిమా అయినా అఆ కి ముందుగా దేవి శ్రీ ప్రసాద్ ని తీసుకోవాలని త్రివిక్రమ్ అనుకున్నారని, అయితే దేవిశ్రీ ఆ సినిమాకి పని చేయడం కోసం కుమారి 21 ఎఫ్ సినిమా తరహాలో భాగస్వామ్యం కోరాడని, దీంతో హర్ట్ అయిన త్రివిక్రమ్ అప్పటినుండి దేవిశ్రీప్రసాద్ ని తన సినిమాలకు తీసుకోవడం మాని వేశారని ఒక రూమర్ ఉంది. ఈ రూమర్ ఎంత వ్యాప్తి చెందినప్పటికీ దీనిపై అటు త్రివిక్రమ్ కానీ ఇది దేవిశ్రీ కానీ ఎప్పుడూ స్పందించలేదు.
దీంతో ఈ రోజు వినయ విధేయ రామ ఫంక్షన్ లో త్రివిక్రమ్ దేవిశ్రీ ప్రసాద్ గురించి నాలుగు మంచి మాటలు మాట్లాడి ఆ రూమర్స్ కి ఫుల్ స్టాప్ పెడతారేమో అనుకున్న వాళ్ళకి ఆశ్చర్యం కలిగించేలా త్రివిక్రమ్ శ్రీనివాస్ అసలు దేవిశ్రీ గురించి ప్రస్తావన చేయకుండా తన ఉపన్యాసాన్ని ముగించారు. ఇంతకీ దేవిశ్రీ , త్రివిక్రమ్ ల మధ్య ఏం జరిగిందన్నది మరొకసారి సస్పెన్స్ గానే మిగిలిపోయింది.
‘రంగస్థలం’పై త్రివిక్రమ్ మనసులో మాట
‘ఈ సినిమా బాగుంది’ అని త్రివిక్రమ్ ఓ సినిమాని మెచ్చుకోవడం చాలా అరుదు. ఆయన ట్విట్టర్లోనూ, ఫేస్ బుక్‌లోనూ టచ్‌లో ఉండరు కదా..? అందుకే ఆ సందర్భం, వేదిక త్రివిక్రమ్‌కి దొరకలేదు. అయితే ఈమధ్య కాలంలో త్రివిక్రమ్‌కి బాగా నచ్చిన సినిమా ‘రంగస్థలం’. ఆసినిమా వచ్చిన దాదాపు తొమ్మిది నెలల తరవాత… ఈ సినిమాపై తనకున్న ప్రేమని వ్యక్తపరిచాడు త్రివిక్రమ్. చరణ్ సినిమా ‘వినయ విధేయ రామ’కి ఒకానొక అతిథిగా వచ్చాడు త్రివిక్రమ్. ఈ సందర్భంగా `రంగస్థలం` సినిమా గురించి ప్రస్తావించాడు.
కొన్ని సినిమాలు తీసినవాళ్లకు గౌరవాన్ని, తీసిన వాళ్లకు తృప్తిని మిగిలిస్తాయి. అలాంటి సినిమా `రంగస్థలం` అని కాంప్లిమెంట్ ఇచ్చాడు త్రివిక్రమ్. ”కొన్ని సినిమాలు హిట్టయితాయి. కొన్ని సూపర్ హిట్లవుతాయి. కొన్ని బ్లాక్ బస్టర్లుగా మిగిలిపోతాయి. అయితే.. కొన్ని మాత్రమే సినిమా తీసేవాళ్ల ఆలోచనా విధానాన్ని మారుస్తుంది. అలాంటి సినిమా రంగస్థలం. ఈ సినిమా చూసిన వెంటనే.. సుకుమార్‌తోనూ, చరణ్‌తోనూ మాట్లాడా. ఆ సినిమాపై నాకున్న ఇష్టాన్ని వాళ్లముందు ప్రదర్శించా. నాకు ఫేస్ బుక్, ట్విట్టర్ లేవు కాబట్టి నా భావాన్ని వ్యక్త పరిచే అవకాశం రాలేద”న్నారు. ”సింహం ప్రతీరోజూ వేటకు రాదు. పది పన్నెండు రోజులకు ఓసారి, బాగా ఆకలి గా ఉన్నప్పుడే వేటకు వస్తుంది. వచ్చినప్పుడు మాత్రం వేట సాలీడ్‌గా ఉంటుంది. చరణ్ కూడా అంతే. కొడితే… మామూలుగా ఉండదు. కొడుకు చేతుల్లో ఓడిపోవడం కంటే గొప్ప ఆనందం ఏ తండ్రికీ ఉండదు. అలాంటి ఆనందాన్ని ఇప్పుడు చిరంజీవి అనుభవిస్తున్నార”న్నాడు త్రివిక్రమ్.