ఒక్క సినిమా చాలు. హీరోయిన్ జాతకం మారిపోవడానికి. ఉప్పెనతో… కృతి శెట్టి స్టార్ అయిపోయింది. ఆమె కాల్షీట్లు ఇప్పుడు హాట్ కేకులు. అంతకంటే ఎక్కువగా శ్రీలీల జాతకం టర్న్ అయిపోయింది. పెళ్లి సందడితో ఎంట్రీ ఇచ్చింది శ్రీలీల. అదేం గొప్ప సినిమా కాదు. హీరోయిన్ క్యారెక్టర్ ఆహా.. ఓహో అన్నట్టుగానూ లేదు. కానీ… శ్రీలీల చూడ్డానికి ముద్దొచ్చింది. తన నటన, డాన్సులు నచ్చాయి. దాంతో ఆమెను చూడ్డానికే యువత థియేటర్లకు వెళ్లింది. ఫలితం… ఫ్లాప్ అనుకున్న సినిమా లాభాలతో గట్టెక్కింది.శ్రీలీల స్క్రీన్ ప్రెజెన్స్ అందరికీ నచ్చేసింది. దాంతో వరుస ఆఫర్లు వచ్చాయి. అవీ చిన్నా చితకా సినిమాలు కాదు. రవితేజ, బాలకృష్ణ, మహేష్‌బాబు లాంటి స్టార్ల సినిమాలు. నవీన్ పొలిశెట్టితోనూ ఓ సినిమా చేయనుంది. రవితేజతో `ధమాకా` ఎప్పుడో మొదలైపోయింది.
మహేష్ బాబు – త్రివిక్రమ్ సినిమాలో శ్రీలీల సెకండ్ హీరోయిన్. నిజానికి… హీరోయిన్ చెల్లెలి పాత్రలో శ్రీలీలని తీసుకుందామనుకున్నారు. ఆ పాత్రకు స్పాన్ చాలా తక్కువ. పైగా పాటలు కూడా లేవు. సరిగ్గా… అరవింద సమేతలో ఈషారెబ్బా లాంటి పాత్ర. ఎంత మహేష్ సినిమాలో అయితే మాత్రం, ఇలా వచ్చి, అలా వెళ్లిపోవడం శ్రీలీలకు నచ్చలేదు. ఈ సినిమాలో నటించడానికి కాస్త తటపటాయించిందట. శ్రీలీల ఇబ్బంది తెలుసుకున్న త్రివిక్రమ్ ఈ పాత్ర స్పాన్ మొత్తం మార్చేశారు. మహేష్‌తో ఓ పాటకు స్పేస్ ఇచ్చారు. దాంతో పాటు సీన్లు పెంచారు. అలా… శ్రీల పాత్ర స్వభావం మొత్తం మారిపోయిందని తెలుస్తోంది. మహేష్ సినిమాలో తన స్క్రీన్ టైమ్ తక్కువైనా, ఉన్న కాసేపూ.. శ్రీలీల తనదైన ముద్ర వేయబోతోందని సమాచారం.