తెలుగు చలన చిత్ర పరిశ్రమలో అత్యంత ఖరీదైన మాటల రచయిత అంటే… త్రివిక్రమ్ పేరే చెప్పాలి. అప్పట్లో ఆయన సినిమాకి `కోటి` తీసుకొంటుంటే… వామ్మో అనుకొన్నారు జనాలు. ఆ డిమాండ్ అట్లా ఉండేది. దర్శకుడు అయ్యాక కూడా అప్పుడప్పుడూ తన కలాన్ని ఝులిపిస్తూనే ఉన్నారు. జై చిరంజీవ, తీన్ మార్ లాంటి సినిమాలకు తన మాటలు అందించారు. అప్పుడు కూడా నెవర్ బిఫోర్ రేటే అందుకొన్నారు.
భీమ్లా నాయక్ నుంచి త్రివిక్రమ్ మరో దారి పట్టారు. ప్రాజెక్ట్ అంతా సెట్ చేసి, మాటలు అందించినందుకు ఆ సినిమా ద్వారా ఏకంగా రూ.10 కోట్లు వెనకేశారు. ఇప్పుడు `బ్రో`ది మరో లెక్క. ఈ ప్రాజెక్ట్ సెట్ అవ్వడానికి కారణం… త్రివిక్రమే. స్క్రీన్ ప్లే, సంభాషణలు అందించారు. అన్నింటికి కలిపి మొత్తంగా రూ.15 కోట్లు అందుకొన్నారని సమాచారం. ఓ రచయితకి ఈ స్థాయిలో పారితోషికం ఇవ్వడం టాలీవుడ్ కే చెల్లేమో..?! త్రివిక్రమ్ రూ.15 కోట్లతో ఆగలేదు. ఈ సినిమా లాభాల్లోనూ ఆయనకు వాటా ఉంది. ఎంత కాదన్నా, లాభాల పేరిట మరో రూ.5 కోట్లు వేసుకొన్నా ఈ సినిమా ద్వారా త్రివిక్రమ్ సంపాదించింది ఏకంగా రూ.20 కోట్లు. ఈరోజుల్లో స్టార్ డైరెక్టర్లు రెండేళ్లు కష్టపడి సినిమా తీసినా ఇంత సంపాదించలేరు. మాటల రచయితగా సుఖం ఉంది. జయాపజయాలతో పెద్దగా ఫరక్ పడదు. సినిమా హిట్టయితే ఆ క్రెడిట్ తీసుకోవచ్చు. పోతే… దర్శకుడు సరిగా డీల్ చేయలేదని సర్దిచెప్పుకోవచ్చు. ఎలాగైనా త్రివిక్రమ్ కి ఇది లాభసాటి డీల్.