”సమంత గారూ.. మీరు ఎప్పుడూ ముంబైలోనే కాదు, అప్పుడప్పుడూ హైదరాబాద్ కీ వస్తుండండి.. మీరు చేయరేమో అని నేను క్యారెక్టర్లు రాయడం లేదు..”
సమంతని ఉద్దేశించి త్రివిక్రమ్ అన్నమాటలు ఇవి. ఈరోజు ‘జిగ్రా’ అనే సినిమా ఈవెంట్ జరిగింది. అలియాభట్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా ఈనెల 11న వస్తోంది. ప్రమోషన్లలో భాగంగా అలియా హైదరాబాద్ వచ్చింది. అలియా స్నేహితురాలైన సమంత కూడా ఈ మీట్ లో పాల్గొంది. చాలా రోజుల తరవాత సమంత హాజరైన ఓ సినిమా వేడుక ఇది. అందుకే అటెన్షన్ ఎక్కువగా అటువైపు వెళ్లింది. ఈ సందర్భంగా త్రివిక్రమ్ సమంతని ఉద్దేశించి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
పైకి సరదాగానే అనిపిస్తున్నా, ఓరకంగా ఇందులో నిజం ఉంది. సమంత మన దర్శకులకు, నిర్మాతలకూ అందుబాటులో ఉండడం లేదన్నది ఎంతకాదన్నా నిజమే. ఆమె ప్రస్తుతం ముంబైలోనే ఉంటోంది. అక్కడే మకాం పెట్టేసింది. కొన్ని బాలీవుడ్ ప్రాజెక్టులు చేస్తోంది. వాటితోనే బిజీగా గడుపుతోంది.
సమంతని కలవాలన్నా, ఆమె అప్పాయింట్మెంట్ కావాలన్నా ముంబై వెళ్లాల్సిందే. ఇది వరకు తెలుగులో ఆమెకు ఓ మేనేజర్ ఉండేవారు. ఆయనతో పనులు చక్కబడేవి. కానీ ప్రస్తుతానికి ఆ మేనేజర్ పోస్ట్ కూడా ఖాళీనే. సమంత కోసం ముంబై వెళ్లడం ఈరోజుల్లో పెద్ద పనేం కాదు. కాకపోతే.. హైదరాబాద్ లో ఉంటే, మన దర్శకులకు, నిర్మాతలకూ బాగా టచ్లో ఉండేది. దాదాపు రోజుకో కథ వినేది. ఇప్పుడా పరిస్థితి లేదు. సమంతకు తెలుగు కంటే, బాలీవుడ్ ప్రాజెక్టులపై మక్కువ పెరిగిందన్న మాట నిజం. అందుకే అటువైపు ఫోకస్ పెట్టింది. త్రివిక్రమ్ లాంటి దర్శకులు కాస్త చొరవ తీసుకొని, క్యారెక్టర్లు సృష్టిస్తే, తెలుగులో నటించడానికి సమంత సిద్ధంగా ఉంది. సమంత హైదరాబాద్ షిఫ్ట్ అవ్వాలన్నది త్రివిక్రమ్ ఇన్నర్ ఫీలింగ్ మాత్రమే కాదు. బహుశా దర్శకులందరిదీ. కాకపోతే.. ఆమెను కదిలించే స్క్రిప్టులు రాయాలి, రావాలి. దర్శకులంతా ఆ పనిలో ఉంటే, సమంత ని హైదరాబాద్ నుంచి ఎవరూ కదిలించలేరు.