ఏ స్టార్ డైరెక్టర్‌కీ లేనంత సందిగ్థత ఇప్పుడు త్రివిక్రమ్ అనుభవిస్తున్నాడు. గుంటూరు కారం తరవాత త్రివిక్రమ్ సినిమా ఏదీ మొదలవ్వలేదు. అలాగని ఆయన ఖాళీగా లేడు. అల్లు అర్జున్ సినిమా కోసం ఓ కథ రెడీ చేశారు. అయితే అట్లీ వచ్చి త్రివిక్రమ్ ప్లాన్‌కు బ్రేకులు వేశాడు. బన్నీ – అట్లీ సినిమా వర్క్ స్పీడు అందుకోవడంతో త్రివిక్రమ్ స్లో అవ్వాల్సివచ్చింది. ముందుగా అట్లీ సినిమా షూటింగ్ స్టార్ట్ అవుతుంది. ఆ తరవాతే త్రివిక్రమ్ సినిమా. అయితే ఈమధ్యలో త్రివిక్రమ్ మరో సినిమా చేయాలన్న ఆలోచనలో పడ్డాడు. వెంకటేష్, రామ్, ధనుష్, శివ కార్తికేయన్.. ఇలా చాలా ఆప్షన్లు ఉన్నాయి. వాళ్లకు తగిన కథలూ ఉన్నాయి. శివ కార్తికేయన్‌తో సినిమా దాదాపుగా ఫిక్స్ అన్నట్టు వార్తలూ వినిపించాయి. జూన్, జులై నుంచి శివ కార్తికేయన్ డేట్లు ఇస్తాడన్నాడని టాక్.
అయితే త్రివిక్రమ్ ని ఇంకా సందిగ్థం వీడలేదు. అట్లీతో పాటు త్రివిక్రమ్ సినిమానీ సమాంతరంగా పూర్తి చేస్తానని బన్నీ మాట ఇస్తున్నాడట. అది వర్కవుట్ అవుతుందా, లేదా? అనే విషయంలో ఇంకా క్లారిటీ రాలేదు. డేట్లు అడ్జస్ట్ చేస్తే ఎలా చేస్తాడు? లుక్ పరంగా ఇబ్బంది రాదా? అనే సందేహాలు వస్తున్నాయి. ‘గుంటూరు కారం’ తరవాత త్రివిక్రమ్ కి చాలా గ్యాప్ వచ్చింది. బన్నీ కోసమని ఇంకా వెయిటింగ్ లో ఉండలేడు. అట్లీ సినిమా ముసిగే లోపు త్రివిక్రమ్ ఓ ప్రాజెక్ట్ పూర్తి చేస్తే… పారితోషికం రూపంలో కనీసం రూ.40 కోట్లు వెనకేసుకోవొచ్చు. బన్నీ కోసం ఇప్పుడు మరింత ఎదురు చూస్తే… ఆ ప్రాజెక్ట్ ఎప్పుడు మొదలవుతుందో అంచనా వేయడం కష్టం. అందుకే బన్నీని ఒప్పించి, శివ కార్తికేయన్ సినిమాని ముందుకు తీసుకెళ్లడమే బెటర్ అనే అభిప్రాయంలో ఉన్నాడు త్రివిక్రమ్. ఈవారంలో బన్నీతో ఓ మీటింగ్ ఉండొచ్చు. అది అయితే… త్రివిక్రమ్ ముందుకు ఎలా వెళ్లాలన్న విషయంలో ఓ క్లారిటీ వస్తుంది. అప్పటి వరకూ ఈ ఊగిసలాట తప్పదు.