ఏమాటకామాట చెప్పుకోవాలి. త్రివిక్రమ్ వచ్చాక ‘సినిమా భాష’ మారింది. క్లుప్తత, స్పష్టత, సొగసు.. ఇవన్నీ వచ్చి చేరాయి. అవసరం ఉన్నా, లేకున్నా పంచ్‌లూ, ప్రాసలూ వాడడం ఎక్కువైనా – భాషలో సొగసు బాగా మారింది. త్రివిక్రమ్‌లా రాయాలి.. త్రివిక్రమ్‌లా పంచ్ వేయాలి అని ప్రతీ రచయిత ఆపసోపాలు పడ్డాడు, పడుతున్నాడు. అయితే పంచ్‌లపై త్రివిక్రమ్ ఇప్పుడు సరికొత్తగా స్పందించాడు. తానెప్పుడూ పంచ్‌ల కోసం తాపత్రయ పడలేదని, డైలాగుల్లో ‘ఫన్’ వెదుక్కునే ప్రయత్నం చేశానని, అవే పంచ్‌లుగా మారాయేమో అంటున్నాడు త్రివిక్రమ్. పంచ్ డైలాగ్ వేయడం కంటే ఫిలాసఫీ చెప్పడమే ఇష్టమంటున్నాడు ఈ మాటల మాంత్రికుడు.
ఓ ప్రధాన పత్రికకు ఇచ్చి ఇంటర్వ్యూలో భాషకు సంబంధించిన కొన్ని అనుమానాలు, ప్రశ్నలూ లేవదీశాడు త్రివిక్రమ్. టీవీ వచ్చాక, ఛానళ్లు పెరిగిపోయాక.. భాష చాలా మారిందని, అయితే తెలుగు కానిది కూడా తెలుగులా చలామణీ అవుతోందని ఆవేదక వ్యక్తం చేశాడు త్రివిక్రమ్. ‘ఆయన రావడం జరిగింది, చెప్పడం జరిగింది, వెళ్లడం జరిగింది’ – ఇదీ మన టీవీ భాష. రిపోర్టలు అప్పటికప్పుడు పదాల్ని వెదుక్కుని మరీ చెబుతున్నారు. టీవీలు చూసే యువతరం అదే తెలుగు అనే భ్రమల్లో ఉంటోంది. రేపొద్దుట.. దాన్నే తెలుగు అంటారేమో” అంటూ తెలుగు భాషపై ఆవేదన వ్యక్తం చేశాడు త్రివిక్రమ్. నిజంగానే కొన్ని టీవీ ఛానళ్లలో భాష దారుణంగా తయారైంది. ‘కర్మ’ అనేది ఒకటుంటుదని, ఏక వచనాలు, బహువచనాలకూ తేడా ఉంటుందని తెలియని గందరగోళంలో ఉన్నారు కొంతమంది టీవీ రిపోర్టర్లు. టీవీల ప్రభావం, అందులో వినిపిస్తున్న భాష ప్రభావం సమాజంలో విపరీతంగా ఉంది. నిజంగా వాళ్లు కూడా ఇదే తెలుగు ఫాలో అయితే… భాష ఖూనీ కాకుండా ఎలా ఉంటుంది?
తెలుగు రచయితలపై, నవలాకారులపై కాస్త సానుభూతి వ్యక్తం చేశాడు త్రివిక్రమ్. కేంద్ర సాహిత్య అకాడమీ లాంటి ప్రతిష్టాత్మక అవార్డులకు ఇచ్చే నగదు బహుమానాలు చాలా తక్కువని, వాటిని పది, ఇరవై రెట్లు పెంచినా తప్పులేదని ప్రభుత్వానికి సలహా ఇస్తున్నాడు. అప్పుడే రాయాలన్న ఆలోచన పెరుగుతుందన్నది త్రివిక్రమ్ ఉద్దేశం. నిజంగా ఇది మంచి ఆలోచనే. కామన్ వెల్త్ లో పతకం సాధిస్తే, లక్షలు, ఇళ్ల స్థలాలూ ధారబోస్తున్నారు. వాళ్లతో పోలిస్తే రచయిత ఎందులో తక్కువ? తెలుగు దర్శకులు నవలలపై దృష్టి పెట్టాలన్నది త్రివిక్రమ్ మాట. హాలీవుడ్ చిత్రాల్లో దాదాపుగా 95 శాతం సినిమాలు వవల ఆధారంగా తెరకెక్కుతున్నాయని త్రివిక్రమ్ లెక్క చెబుతున్నాడు. ఆ పరిస్థితి తెలుగులోనూ వస్తే రచయితలు మరింత పెరుగుతారన్నది ఆయన మాట. ‘అ.ఆ’ నవలని సినిమాగా తీసిన త్రివిక్రమ్.. భవిష్యత్తులో మరిన్ని పుస్తకాలను సినిమాలుగా మలుస్తానని మాట ఇస్తున్నాడు. మిగిలిన దర్శకులూ అటుగా ఆలోచిస్తే మంచిదేమో..?