ఈ రోజు త్రివిక్రమ్ పుట్టిన రోజు. ట్విట్టర్లో అదే ట్రెండింగ్ నడుస్తోంది. అయితే ఈ పుట్టిన రోజున త్రివిక్రమ్ కొత్త సినిమా సంగతులేమైనా తెలుస్తాయేమో అని ఎన్టీఆర్ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూశారు. అయితే అవేం చెప్పకుండా.. ఈ పుట్టిన రోజున చప్పగా సాగనంపారు. ఎన్టీఆర్ – త్రివిక్రమ్ కాంబోలో ఓసినిమా రూపుదిద్దుకోనున్న సంగతి తెలిసిందే. ఈ కాంబో ఎప్పుడో ఫిక్సయ్యింది. అయితే ఆ తరవాత ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. షూటింగ్ సంగుతులు చెప్పడం గానీ, టైటిల్ బయట పెట్టడం గానీ జరగలేదు. ఎన్టీఆర్ సినిమా అప్ డేట్ గురించి అభిమానులు ఎదురు చూస్తున్నారని తెలుసు… మంచి తరుణంలో మేమే అప్ డేట్ ఇస్తాం.. అని నిర్మాణ సంస్థ కూడా ఇది వరకే చెప్పింది. కానీ.. ఇప్పటి వరకూ అలాంటి అప్ డేట్ లు ఏమీ లేవు.
ఎన్టీఆర్ సినిమా చేసేలోగా.. త్రివిక్రమ్ మరో సినిమా చేస్తున్నాడని, అందుకోసం ప్రయత్నాలు జరుగుతున్నాయని వార్తలొచ్చాయి. కనీసం వీటిపై అయినా క్లారిటీ ఇవ్వాల్సింది. `అయిననూ పోవలె హస్తినకు` అనే టైటిల్ ఒకటి ప్రచారంలో ఉంది. దాన్నయినా ఖాయం చేయాల్సింది, లేదంటే కొత్త టైటిల్ చెప్పాల్సింది. ఇవేం.. కనిపించకపోయే సరికి, షూటింగ్ అప్ డేట్ లేకపోయే సరికి.. ఎన్టీఆర్ అభిమానులు కాస్త అసంతృప్తిలో ఉన్నారు. ఈ ఎదురు చూపులకు, నిరీక్షణకు త్రివిక్రమ్ ఎప్పుడు తెర దించుతాడో మరి.