త్రివిక్రమ్ – సునీల్ సూపర్ హిట్ కాంబినేషన్. సునీల్ హీరో కాకముందు… త్రివిక్రమ్ రాసిన, తీసిన అన్ని సినిమాల్లోనూ సునీల్‌కి మంచి పాత్రలు పడ్డాయి. గతేడాది విడుదలైన `అరవింద సమేత వీర రాఘవ`లోనూ సునీల్ నీలాంబరిగా కనిపించాడు. హీరోగా అవకాశాలు సైడ్ అయిపోవడంతో.. మళ్లీ కమెడియన్ బాట పట్టి, క్రేజీ ప్రాజెక్టుల్లో అవకాశాలు చేజిక్కించుకుంటున్న సునీల్.. మరోసారి త్రివిక్రమ్ సినిమాలో భాగస్వామిగా మారుతున్నాడు. అల్లు అర్జున్ – త్రివిక్రమ్ కాంబినేషన్లో ఓ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇందులోనూ సునీల్‌కి మంచి పాత్ర దక్కింది.
అరవింద సమేత, అమర్ అక్బర్ ఆంటోనీ, పడి పడి లేచె మనసు సినిమాల్లోనూ సునీల్ కమెడియన్‌గా కనిపించిన సంగతి తెలిసిందే.కాకపోతే.. ఇది వరకటి టైమింగ్ సునీల్‌లో చూడలేకపోయారు ప్రేక్షకుడు. బాగా లావైపోయి.. కదలడానికి ఇబ్బంది పడుతున్న సునీల్ ప్రేక్షకుల్ని గతంలోలా నవ్వించలేకపోతున్నాడు. నీలాంబరి పాత్ర బాగున్నప్పటికీ.. అది మహా సీరియస్ గా సాగుతుంది. అయితే ఈసారి మాత్రం త్రివిక్రమ్… అలా సీరియస్ పాత్ర జోలికి వెళ్లలేదని తెలిసింది. సునీల్‌లోని కమెడియన్ని బటయకు లాగేలా, తన కెరీర్‌కి ఉపయోగపడేలా ఈ పాత్రని తీర్చిదిద్దాడట. కమెడియన్‌గా యూ టర్న్ తీసుకున్నప్పటికీ అదృష్టం కలసి రాక… డల్ గా సాగుతున్న సునీల్‌కి త్రివిక్రమ్ అయినా జోష్ అందిస్తాడేమో చూడాలి.