`సర్కారు వారి పాట` తరవాత… మహేష్‌బాబు – త్రివిక్రమ్ సినిమా పట్టాలెక్కనుంది. నిజానికి గత నెల 31నే ఈ సినిమాకి సంబంధించిన అప్ డేట్ ఒకటి బయటకు రావాలి. కానీ కుదర్లేదు. అయితే విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. త్రివిక్రమ్ ఇంకా పూర్తి స్థాయిలో కథ తయారు చేయలేదట. మహేష్ కి ఇంకా పూర్తి స్క్రిప్టుని వినిపించలేదని, ప్రస్తుతం ఆ పనిలోనే తర్జన భర్జనలు పడుతున్నాడని సమాచారం.
`అతడు` టైపులోనే… మహేష్ కోసం ఓ లైన్ సిద్ధం చేశాడు త్రివిక్రమ్. అతడులో… మహేష్ ఓ క్రిమినల్. తల దాచుకోవడానికి ఓ ఇంట్లో మారు పేరుతో చలామణీ అవుతుంటాడు. సరిగ్గా ఇలాంటి లైన్ తోనే మహేష్ కోసం ఓ కథ అల్లుతున్నాడు త్రివిక్రమ్. కాకపోతే.. ఇందులో మహేష్ అండర్ కవర్ పోలీస్ అని సమాచారం. ఆ విషయం దాచి పెట్టి, ఓ ఇంట్లో ఉంటాడు. ఇదీ.. క్లుప్తంగా మహేష్ కి త్రివిక్రమ్ చెప్పిన లైను. దానికి మహేష్ కూడా ఓకే అన్నాడు. కానీ ఇప్పటి వరకూ పూర్తి స్థాయి స్క్రిప్టు తయారు కాలేదు. ఇంట్రవెల్ ట్విస్టు, క్లైమాక్స్… ఇలా త్రివిక్రమ్ రాసుకుంటూ వెళ్లాడు గానీ, మధ్యలో ఫిల్ చేయాల్సిన గ్యాపులు చాలానే ఉన్నాయని, ఇవన్నీ పూర్తయ్యేసరికి టైమ్ పట్టేలా ఉందన్నది ఇన్సైడ్ వర్గాల టాక్. పైగా.. మహేష్ కీ అంత తొందరేం లేదు. ముందు `సర్కారు వారి పాట` పూర్తవ్వాలి. అది జరగాలంటే… కోవిడ్ నిబంధనలు సడలించి, షూటింగులకు అనుమతి ఇవ్వాలి. ఈలోగా త్రివిక్రమ్ దగ్గర కావల్సినంత టైమ్ ఉంది. అందుకే త్రివిక్రమ్ కూడా రిలాక్డ్స్‌గా కథ గురించి ఆలోచిస్తున్నాడట.