‘అత్తారింటికి దారేది’ తరవాత… పవన్ కల్యాణ్ – త్రివిక్రమ్‌ల కాంబోలో రావాల్సిన సినిమా ‘కోబలి’. స్క్రిప్టు కూడా పూర్తయ్యింది. కానీ.. ఎందుకో ఆ ప్రాజెక్టు పక్కన పెట్టేశారు. ‘అజ్ఞాతవాసి’ స్థానంలో ‘కోబలి’ సెట్స్‌పైకి వెళ్లాల్సింది. కానీ ‘సర్దార్’ ఫ్లాప్ తరవాత ప్రయోగం చేయడానికి ఇష్టపడని త్రివిక్రమ్ కమర్షియల్ దారిలోనే వెళ్లి ‘అజ్ఞాతవాసి’ తెరకెక్కించారు. అయితే ‘కోబలి’ని ఎప్పటికైనా తీస్తానని త్రివిక్రమ్ చెబుతూనే ఉన్నాడు. ఇప్పుడు అందుకు ముహూర్తం సెట్ అయ్యింది. 2020లో ‘కోబలి’ తప్పకుండా ఉంటుందని తెలుస్తోంది. ‘అజ్ఞాతవాసి’ నష్టాల్ని పవన్, త్రివిక్రమ్‌లు కలసి పూడ్చేశారు. అయినా నిర్మాతకు కొంత లోటే కనిపిస్తోంది. దాన్ని తీర్చడానికి `కోబలి`ని సెట్స్‌పైకి తీసుకెళ్తారట. మినిమం బడ్జెట్లో ఈ సినిమాని పూర్తి చేయాలని త్రివిక్రమ్ భావిస్తున్నాడట. సెట్స్, పాటలు, ఫైటింగులూ లేకుండా ఈ సినిమా రూపొందనుంది. కాబట్టి.. ఖర్చుని అదుపులో పెట్టుకోవొచ్చు. ప్రయోగాత్మకంగా కేవలం మూడు నెలల్లో ఈ సినిమాని పూర్తి చేయాలని భావిస్తున్నార్ట. 2019 ఎన్నికల వరకూ పవన్ బిజీ. అది పూర్తయ్యాకే `కోబలి` ఉంటుంది. ‘అజ్ఞాతవాసి’ ఫ్లాప్‌తో పవన్ – త్రివిక్రమ్‌ల మధ్య స్నేహం చెడిందని చాలామంది భావిస్తున్నారు. వాళ్లకు సమాధానంగా మళ్లీ కలసి ఓ సినిమా చేయాలని పవన్, త్రివిక్రమ్ డిసైడ్ అయినట్టున్నారు. అందుకే పక్కన పెట్టేసిన ‘కోబలి’ పట్టాలెక్కించడానికి రెడీ అయ్యారు.