చిత్రసీమలో సెంటిమెంట్స్ ఎక్కువ. ముఖ్యంగా టైటిల్స్ విషయంలో అక్షరాలు, అంకెలకు ప్రాధాన్యం ఉంటుంది. త్రివిక్రమ్ కి ‘అ’ సెంటిమెంట్. ఆయన సినిమా పేర్లన్నీ దాదాపుగా `అ`తో మొదలయ్యేవే. ఈ సెంటిమెంట్ వర్కవుట్ అయ్యింది కూడా. మహేష్ బాబుకీ ఇలాంటి సెంటిమెంటే ఉంది. ఆయన టైటిల్స్ ఎక్కువగా మూడక్షరాలతో సాగేవే. ఇది కూడా హిట్లు ఇచ్చింది. అందుకే వీరిద్దరూ కలిసి, ముచ్చటగా చేస్తున్న మూడో సినిమా పేరు ఏమై ఉంటుందా? అనే ఆసక్తి రేగింది. ‘అయిననూ పోవలె హస్తినకు’, ‘అమరావతికి అటూ ఇటూ’ లాంటి పేర్లు పరిశీలించి చివరకు `గుంటూరు కారం` అనే పేరు ఖరారు చేశారు.
మహేష్ సినిమాకి గుంటూరు కారం అనే టైటిల్ పెడతారన్న వార్త రాగానే ఎవరూ పెద్దగా నమ్మలేదు. ఎందుకంటే అటు త్రివిక్రమ్ ‘అ’ సెంటిమెంట్ కీ, ఇటు.. మహేష్ మూడక్షరాల సెంటిమెంట్ కీ ఈ టైటిల్ చాలా దూరంగా ఉంది. కనీసం ‘అమరావతికి అటూ ఇటూ’ అనే పేరు ఫిక్స్ చేస్తారని అనుకొన్నారు. కానీ గుంటూరు కారమే పోస్టర్ పై కనిపించింది. అంటే.. త్రివిక్రమ్, మహేష్ తమ సెంటిమెంట్లని పక్కన పెట్టేశారన్నమాట. పవన్ కల్యాణ్ – సాయిధరమ్ తేజ్ సినిమాకీ టైటిల్ నిర్ణయించింది త్రివిక్రమే. ఆయన ఆ చిత్రానికి ‘బ్రో’ అనే పేరు పెట్టాడు. అక్కడా అ సెంటిమెంట్ పాటించలేదు.