మహేష్ బాబు – త్రివిక్రమ్ కాంబోలో హ్యాట్రిక్ సినిమాకి రంగం సిద్ధమైంది. `సర్కారు వారి పాట` తరవాత మహేష్ చేయబోయే సినిమా ఇది. ఇప్పటికే త్రివిక్రమ్ కథ సిద్ధం చేసేశాడు. దాన్ని ఇప్పుడు సాన బెడుతున్నాడు. త్రివిక్రమ్ సినిమాలన్నీ ఇప్పుడు హారిక హాసిని బ్యానర్లోనే. ఇప్పుడు మహేష్ సినిమా కూడా అంతే. కాకపోతే.. ఈ సినిమాలో మహేష్ కూడా నిర్మాణ పరంగా వాటా తీసుకోబోతున్నాడు. తన జీఎంబీ ఎంటర్టైన్మెంట్స్ సంస్థ కూడా నిర్మాణ భాగస్వామిగా వ్యవహరించబోతోంది. మహేష్ కి ఇవ్వాల్సిన పారితోషికంలో సగం మాత్రమే క్యాష్ రూపంలో తీసుకుంటున్నాడని, మిగిలినది.. తన వంతు పెట్టుబడిగా పెడుతున్నాడని టాక్. మే 31న ఈ చిత్రం క్లాప్ కొట్టుకునే అవకాశం ఉంది. ఆ రోజు.. కృష్ణ పుట్టిన రోజు. ఈ సందర్భంగా.. ఈ సినిమా పట్టాలెక్కబోతోంది. తమన్ ఈ చిత్రానికి సంగీతం అందించనున్నాడు. త్వరలోనే పూర్తి వివరాలు తెలుస్తాయి.