మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ఎవరితో సినిమా చేసినా…. టాలీవుడ్ చూపంతా అటువైపే ఉంటుంది. అలాంటిది మెగా స్టార్ చిరంజీవి – త్రివిక్రమ్ కాంబో అంటే.. అది పట్టాలెక్కకముందే సూపర్ హిట్ అనేసుకోవొచ్చు. ఇప్పుడు ఇలాంటి అదరేటి కాంబినేషన్ కోసం సన్నాహాలు జరుగుతున్నాయా?? అంటే అవుననే అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు. చిరు దృష్టి రాజకీయాల నుంచి పూర్తిగా సినిమాల వైపుకు మళ్లుతున్న తరుణం ఇది. 150వ సినిమా అయిపోయిన వెంటనే 151 కూడా పట్టాలెక్కించేయాలన్న కృత నిశ్చయంతో ఉన్నారు. ఆ చిత్రానికి బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తారని కొంతకాలంగా వార్తలు టాలీవుడ్లో చక్కర్లు కొడుతున్నాయి. ఇలాంటి వార్తలపై చిరు వర్గీయులు కూడా సానుకూలంగానే స్పందిస్తూ వచ్చారు. ఇప్పుడు 152వ సినిమాకి కూడా కసరత్తులు మొదలైపోయాయని టాక్.
ఇటీవల ఖైదీ నెం.150 సెట్ లో త్రివిక్రమ్ ప్రత్యక్షం అవ్వడం…. చిరుతో కాసేపు భేటీ వేయడం జరిగిందని టాక్. చిరు సెట్ కి త్రివిక్రమ్ ప్రత్యేకంగా వెళ్లాల్సిన అవసరం ఏమొచ్చింది? అనే ఆరాలు మొదలైపోయాయి. అది కచ్చితంగా కథ చెప్పడానికే అని చాలామంది ఫిక్సయిపోతున్నారు. త్రివిక్రమ్ లాంటి దర్శకుడు కథ చెబుతానంటే చిరు మాత్రం ఎందుకు కాదంటాడు? పైగా త్రివిక్రమ్‌తో జై చిరంజీవ సినిమాకి పని చేశాడు చిరు. తన స్టామినా ఏమిటో చిరుకి బాగా తెలుసు. కాబట్టి కథా చర్చలు జరిగినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. మరో ఆసక్తికరమైన సమాచారం ఏమిటంటే… ఈ చిత్రాన్ని పవన్ కల్యాణ్ క్రియేటీవ్ వర్స్క్ బేనర్‌పై పవన్ కల్యాణ్ నిర్మిస్తాడట. ఇవన్నీ ఎంత వరకూ జరుగుతాయో తెలీదుగానీ.. చెప్పుకోవడానికీ, వినడానికి బాగానే ఉన్నాయి. ఇదే విషయం త్రివిక్రమ్ సన్నిహితుల దగ్గర ఆరా తీసింది తెలుగు 360.కామ్. ”త్రివిక్రమ్ మరో రెండేళ్ల వరకూ ఖాళీ అవ్వరు. ఆయనకు కమిట్మెంట్స్ చాలా ఉన్నాయి” అంటూ సింపుల్‌గా తేల్చేశారు. అంటే… ఈ కలయిక మర్యాద పూర్వకంగానే జరిగిందన్నమాట. పవన్ బ్యానర్లో నితిన్ హీరోగా ఇటీవలే ఓ సినిమా పట్టాలెక్కింది. ఇప్పుడు చిరుతో సినిమా చేయడం అంత ఆషామాషీ కాదు. ఎందుకంటే ‘నా దగ్గర డబ్బుల్లేవ్ బాబోయ్’ అని చెప్పే పవన్‌కి చిరుతో సినిమా తీసేంత సొమ్ములున్నాయంటారా??