‘గుంటూరు కారం’ తరవాత త్రివిక్రమ్ తదుపరి సినిమా విషయంలో క్లారిటీ రాలేదు. ఆయన అల్లు అర్జున్ కోసం ఎదురు చూస్తున్నారు. బన్నీ ఏమో.. అట్లీ వైపు చూస్తున్నాడు. బన్నీతో సినిమా ఆలస్యమైతే ఏం చేయాలన్న విషయంలో త్రివిక్రమ్ దగ్గర ‘ప్లాన్ బి’ కూడా ఉంది. నాని, విజయ్ దేవరకొండ లాంటి యువ హీరోలతో సినిమా పట్టాలెక్కించే ఛాన్స్ ఉందని టీ టౌన్ వర్గాలు చెబుతున్నాయి. నానితో చేసినా, విజయ్ తో చేసినా.. కాంబినేషన్ పరంగా ఫ్రెష్‌గా ఉంటుంది. అందులో డౌటు లేదు. అయితే త్రివిక్రమ్ విజయ్ దేవరకొండతో ఇప్పుడు కాదు.. ఎప్పుడో చేయాల్సింది.
‘వరల్డ్ ఫేమస్ లవర్’ టైమ్‌లోనే త్రివిక్రమ్.. విజయ్‌కి ఓ కథ చెప్పారు. అప్పట్లో ఆ సినిమా ఆల్మోస్ట్ ఫైనల్ అయిపోవాల్సిందే. కానీ కొన్ని కారణాల వల్ల కుదర్లేదు. అదే.. కథని కాస్త మార్చి ‘అల వైకుంఠపురములో’ రూపంలో బన్నీ దగ్గరకు వెళ్లింది. ఆ తరవాత కొంతకాలానికి విజయ్ దగ్గరకు మరో కథ వెళ్లింది. దానికీ విజయ్ ఓకే చెప్పేశాడు. అయితే ప్రొడక్షన్ హౌస్ విషయంలో కాస్త ఇబ్బంది వచ్చింది. అప్పటికి విజయ్ కమిట్ అయిన నిర్మాతకే సినిమా చేస్తానని చెప్పడం, త్రివిక్రమ్ హారిక, హాసినికి తప్ప మరో బ్యానర్‌కి చేయనని మొండికేయడం వల్ల.. త్రివిక్రమ్ సినిమా మరోసారి పట్టాలెక్కలేదు. ఆ కథని మహేష్‌తో మొదలెట్టారు. కానీ అది కూడా అనివార్య కారణాల వల్ల ఆగిపోయింది. ఆ తరవాత ఇదే కాంబినేషన్లో ‘గుంటూరు కారం’ వచ్చింది. అలా రెండుసార్లు విజయ్ దేవరకొండ – త్రివిక్రమ్ కాంబో ఆగిపోయింది. ఇప్పుడు మూడోసారి అవకాశం వచ్చింది. మరి ఈసారి ఏం జరుగుతుందో చూడాలి.