త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ కథానాయకుడిగా ఓ చిత్రం రూపుదిద్దుకుంటున్న సంగతి తెలిసిందే. దీపావళికి ఈ చిత్రాన్ని లాంఛనంగా మొదలెడదామనుకున్నారు. డిసెంబరులో రెగ్యులర్ షూటింగ్ మొదలెడదామన్నది ప్లానింగ్. కానీ… ఈ సినిమా ప్రస్తుతం కాస్త స్లోగా నడుస్తోంది. దానికి గల కారణం…. కథ విషయంలో మార్పులూ చేర్పులూ చేస్తుండడమే. బాలీవుడ్ హిట్ చిత్రం `సోను కి టీటూ కీ స్వీటీ ని బన్నీ కోసం తెలుగులో రీమేక్ చేద్దామన్నది ప్లానింగ్. ఇప్పుడు ఈ రీమేక్ విషయంలో చాలా రోజుల నుంచి అటు త్రివిక్రమ్ ఇటు బన్నీ తర్జన భర్జనలు పడుతున్నారు. ఎలాగైనా సరే ఈ కథే తీయాలన్నది బన్నీ పంతం. ఇంతకంటే మంచి కథ రాసుకుందామన్నది త్రివిక్రమ్ ఆలోచన.
త్రివిక్రమ్ గత సినిమాలన్నీ అయితే రీమేకో, లేదంటే కాపీనో, ఇంకా కాదంటే తెలుగు నవలకు వెండి తెర రూపమో.. అవుతున్నాయి. ఈసారి కూడా మరొకరి కథ ఎంచుకుంటే… కథకుడిగా తనపై నెగిటీవ్ ముద్ర పడుతుందన్నది త్రివిక్రమ్ భయం. అందుకే బన్నీని కన్వెన్స్ చేయడానికి త్రివిక్రమ్ చాలా విధాలుగా ప్రయత్నిస్తున్నాడని తెలుస్తోంది. ఎట్టకేలకు బన్నీ కూడా మనసు మార్చుకున్నట్టు సమాచారం. హిందీ రీమేక్‌ని దాదాపుగా పక్కన పెట్టేశారని, ఆ స్థానంలో త్రివిక్రమ్ బన్నీకి కొత్త లైన్ చెప్పాడన్నది ఇన్ సైడ్ వర్గాల టాక్. ప్రస్తుతం ఆ కథ గురించే పూర్తి కసరత్తు జరుగుతోందని, ఈ ప్రాజెక్టు ఆలస్యం అవ్వడానికి కారణం అదేనని తెలుస్తోంది. మరి ఈసారి త్రివిక్రమ్ ఎలాంటి కథని చెప్పబోతున్నాడో చూడాలి.