త్రివిక్రమ్ సినిమాల్లో డైలాగులే కాదు.. త్రివిక్రమ్ బయట మాట్లాడే మాటలు కూడా మళ్లీ మళ్లీ వినాలనిపించేలా ఉంటాయి. అప్పుడెప్పుడో సిరివెన్నెల సీతారామశాస్త్రి కోసం అనర్గళంగా మాట్లాడిన తీరు.. యూ ట్యూబ్‌లో రిపీటే అనుకొంటూ మళ్లీ మళ్లీ చూస్తుంటారు ఫ్యాన్స్. పవన్ కల్యాణ్ గురించి మాట్లాడేటప్పుడు.. ఆయనకు మరింత ఉత్సాహం వస్తుంది. పవన్ గురించి త్రివిక్రమ్ ఎప్పుడు మాట్లాడినా ఆ స్పీచ్ అద్భుతమై కూర్చుంటుంది. అత్తారింటికి దారేది సమయంలో పవన్ గురించి త్రివిక్రమ్ పలికిన ప్రతీ మాటా… ఆయన అభిమానుల్ని కాలర్ ఎగరేసేలా చేసింది. ఈసారీ అంతే. కాటమరాయుడు ప్రీ రిలీజ్ ఫంక్షన్‌కి ముఖ్య అతిథిగా త్రివిక్రమ్ హాజరవుతారు అనగానే ఈసారీ అదిరిపోయే స్పీచ్ వినడం ఖాయమనుకొన్నారు పవన్ ఫ్యాన్స్! వాళ్ల ఆశల్ని త్రివిక్రమ్ ఏమాత్రం వమ్ము చేయలేదు. పవన్ ని స్తుతిస్తూ సాగిన త్రివిక్రమ్ స్పీచ్ ఎప్పట్లా స్పీచ్ లెస్‌గా మారింది.
ఒకడు చేయెత్తితే జనం ఆగిపోవడం, ఇటు వెళ్లమంటే అక్కడేముందో చూసుకోకుండా వెళ్లిపోవడం.. ఇలాంటి శక్తి కోట్లలో ఒకడికే దేవుడు ఇస్తాడని, ఆ ఒక్కడూ ఎవరో చెప్పాల్సిన పనిలేదని పవన్ స్టామినాని గుర్తు చేశాడు త్రివిక్రమ్. ”మనిషెప్పుడూ ఊరవతల మర్రి చెట్టులా ఉండాలి. ఎందుకంటే మర్రి చెట్టు ఎండాకాలం నీడనిస్తుంది. వర్షంలో తడవకుండా కాపాడుతుంది. కానీ.. నన్ను గుర్తించు అని అడగదు. పవన్ కూడా అంతే. మౌనంగా ఎంత మందికి సహాయం చేశారో.. దానికి ప్రత్యక్ష సాక్షిని నేనే” అంటూ పవన్ మంచి తనం మరోసారి అభిమానులకు గుర్తు చేశాడు. పవన్ మాట్లాడితే అది వేయి గొంతుల స్పందన అని, చాలా మంది కలసి వేసిన ఒక్క అడుగు పవన్ అని.. పవన్ నిలువెత్తు మంచితనం అని అందుకే ఇంతమంది ఫ్యాన్స్ పుట్టుకొచ్చారని పవన్‌ని ఆకాశానికి ఎత్తేశాడు త్రివిక్రమ్.