త్రివిక్రమ్ అంటే చటుక్కున గుర్తొచ్చేవి పంచ్ డైలాగులే. ప్రతీ మాటలోనూ ఓ మెరుపు ఉంటుంది. పంచ్ పడుతుంది. దాంతో డైలాగ్ పండుతుంది. రచయితల్లో త్రివిక్రమ్కంటూ ఓ ప్రత్యేక గుర్తింపు వచ్చిందంటే అదంతా పంచ్ డైలాగుల పుణ్యమే. అయితే ఈ పంచింగులు మరీ ఎక్కువైపోయి… త్రివిక్రమ్లోని అసలైన ప్రతిభను కూడా మరుగున పెట్టేశాయన్న విమర్శ కూడా ఉంది. అవసరం లేని చోట కూడా త్రివిక్రమ్ పంచ్ వాడేస్తున్నాడని వాదించేవాళ్లున్నారు. ఇప్పుడు ఆ పంచ్ గోల.. టీవీ యాడ్‌లోకి కూడా తీసుకొచ్చేశాడు ఈ మాటల మాంత్రికుడు. త్రివిక్రమ్ అప్పుడప్పుడూ… వాణిజ్య ప్రకటనల్నీ రూపొందిస్తాడన్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్‌పై తెరకెక్కించిన ఐపీఎల్ యాడ్ ని త్రివిక్రమ్ రూపొందించాడు.
ఐపీఎల్‌ని తెలుగులోనే ఎందుకు చూడాలి? అనే ప్రశ్నకు సమాధానంగా ఎన్టీఆర్ ప్రాసలతో కూడిన ఓ భారీ డైలాగ్ పలికాడు.
” కారం లేని కోడి… ఉల్లిపాయ లేని పకోడి… పెట్రోల్ లేని గాఢీ… పరుగెత్తడం రాని కేడీ… అవకాయ లేని జాఢీ…ఆటల్లేని బడి… అమ్మప్రేమ లేని ఒడి…” అంటూ ప్రాసలతో పరాచకాలు ఆడేశాడు ఎన్టీఆర్. ఇదంతా త్రివిక్రమ్ పెన్ మహత్మ్మమే అని ప్రత్యేకంగా చెప్పక్కర్లెద్దు. ఇంతకాలం సినిమాలకే పరిమితమైన ఈప్రాస ఇప్పుడు టీవీలకూ ఎక్కేసిందన్నమాట.