`అయ్యప్పయుమ్ కోషియమ్` రీమేక్ కి సంబంధించిన అధికారిక ప్రకటన దసరా సందర్భంగా ఆదివారం వచ్చేసింది. ఈ రీమేక్‌లో పవన్‌నటిస్తాడా, లేదా? అన్న సస్పెన్స్‌కు తెరపడింది. దర్శకుడిగా… సాగర్ చంద్ర పేరు ఖాయమైంది. అయితే ఈ అనౌన్స్మెంట్ రావడానికి ముందు చాలానే మంతనాలు జరిగినట్టు ఇన్ సైడ్ వర్గాల టాక్. ఈ సినిమా ఎలాగైనా సరే, త్రివిక్రమ్ చేతిలో పెట్టాలని పవన్ భావించాడట. `ఈ సినిమాకి మీరే దర్శకత్వం వహించాలి` అని పవన్ అడిగినట్టు తెలుస్తోంది. కానీ త్రివిక్రమ్ మాత్రం అందుకు `నో` చెప్పాడట.
త్రివిక్రమ్ – ఎన్టీఆర్ కాంబోలో ఓ సినిమా ఈపాటికే పట్టాలెక్కాల్సింది. కానీ… అది ఆలస్యమవుతూ వస్తోంది. ఈ గ్యాప్‌లో మరో సినిమా చేయాలన్నది త్రివిక్రమ్ ప్రయత్నం. ఎలాగూ మరో సినిమా చేద్దామనుకుంటున్నారు కదా, అది ఈ సినిమానే ఎందుకు కాకూడదు.? అని `అయ్యప్పయుమ్ కోషియమ్` రీమేక్‌ని ఆయన చేతిలో పెట్టాలని పవన్ భావించాడు. అసలు ఈ సినిమాలోకి పవన్‌కి లాక్కొచ్చిందే త్రివిక్రమ్. సితార ఎంటర్ టైన్మెంట్స్ ఈ సినిమా రైట్స్ తీసుకుంది. అప్పటి వరకూ రకరకాల కాంబినేషన్లని ప్రయత్నించింది గానీ, పవన్ తో చేద్దామన్న ఆలోచనే లేదు. కానీ త్రివిక్రమ్ ఈ సినిమాని పవన్‌కి చూపించడం, పవన్ `ఓకే` అనడం జరిగిపోయాయి. ఈ రీమేక్ లో పవన్‌ని లాక్కొచ్చిన క్రెడిట్ త్రివిక్రమ్ దే.
అలానే దర్శకత్వ బాధ్యతలు కూడా ఆయనకే ఇవ్వాలని పవన్ అనుకున్నాడు. కానీ త్రివిక్రమ్ ఒప్పులేదు. దానికి రెండు కారణాలున్నాయి. అప్పటికే ఈ సినిమా స్క్రిప్టుపై సాగర్ చంద్ర చాలా వర్క్ చేశాడు. దాదాపు పవన్‌కి తగిన మార్పులతో స్క్రిప్టు సిద్ధం చేశాడు. ఈ కథని పవన్‌కి వినిపించింది సాగర్‌నే. అలాంటప్పుడు తనని పక్కన పెట్టడం బాగోదు. పైగా రీమేక్ కథల్ని తీయడం త్రివిక్రమ్‌కి నచ్చదు. ఓ రచయితగా అది తనకు ఇబ్బంది కలిగించే విషయం. అన్నింటికంటే ముఖ్యంగా పవన్ కోసం త్రివిక్రమ్ దగ్గర ఓ కథ రెడీగా ఉంది. పవన్‌తో మరో సినిమా చేయాలంటే ఆ కథనే పట్టాలెక్కిద్దామన్న ఆలోచనలో ఉన్నాడు త్రివిక్రమ్. ఇప్పుడు ఈ రీమేక్ చేసుకుపోతే.. పవన్ తో మరో సారి కాంబినేషన్ కుదరడానికి టైమ్ పట్టొచ్చు. అందుకే ఈసారికి.. సాగర్ చంద్రకే బాధ్యతలు అప్పగించినట్టు తెలుస్తోంది. త్రివిక్రమ్ ఈ సినిమా నేను చేయను అని ఖరాఖండీగా చెప్పేశాకే… రీమేక్‌కి సంబంధించిన ప్రకటన అధికారికంగా విడుదల చేశారు.