అ.ఆ సినిమాకి త్రివిక్రమ్ కొత్త అర్థం ఇచ్చాడు. ఇది చారన్నం లాంటి సినిమా అనేశాడు. ఎక్కవ మసాలా, తీపి, పులుపు ఇవేం లేకుండా చారుతో అన్నం సాదాసీదాగా ఉంటుందని, కానీ అదే ఆరోగ్యం అని.. అఆ కూడా అలాంటి సినిమానే అంటున్నాడు. ఫుడ్ పాయిజన్ అయినప్పుడు.. ఒకట్రెండు రోజులు చారన్నంతో డాక్టర్లు పత్యం చేయమంటారని, అలాంటి సినిమానే తాను తీశానని చెబుతున్నాడు. ఎక్కువ మలుపులు లేకుండా సుతి మెత్తని హాస్యంతో కూడిన సినిమా తీయాలని త్రివిక్రమ్ భావించాడట. ఆ ఆలోచనలోంచే అ.ఆ పుట్టిందట. బూతు కామెడీ, వికలాంగులపై జోకులు లేకుండా నవ్వించడమే తన ధ్యేయమని, అయితే అది చాలా కష్టమని, ఆ కష్టం కోసం తాను ఇష్టంగా పనిచేస్తానని త్రివిక్రమ్ చెబుతున్నాడు. గొప్పగా బతకడం కంటే సాదాసీదాగా బతకడమే కష్టం అని చెప్పిన త్రివిక్రమ్.. అ.ఆలో అందుకు సంబంధించిన లక్షణాలు కనిపిస్తాయంటున్నాడు.
నిజమే. అ.ఆలో పెద్దగా కమర్షియల్ పాయింట్స్ ఉండవు. పెద్దగా మలుపులు లేవు. గొప్ప కథ కాదు. ఆల్రెడీ చూసేసిన సినిమానే. కానీ ప్రేక్షకులు ఇప్పటికీ బ్రహ్మరథం పడుతున్నారు. ఈసినిమాకి రూ.50 కోట్ల వసూళ్లు అందించారు. అంటే.. ఆ సింప్లిసిటీనే ఎక్కడో ఆడియన్స్ ని టచ్ చేసిందన్నమాట. అందుకే అ.ఆని చారన్నంతో పోల్చాడు త్రివిక్రమ్. మొత్తానికి మాటల మాంత్రికుడు అనిపించుకొన్నాడు.