మనమంతా మర్చిపోయిన మాజీ హీరోయిన్లని బిజీ క్యారెక్టర్ ఆర్టిస్టులుగా మార్చేయడంలో త్రివిక్రమ్ దిట్ట. `అత్తారింటికి దారేది`లో నదియాని తీసుకొచ్చి, బిజీ స్టార్ గా మార్చేశాడు. అజ్ఞాతవాసి మిస్ ఫైర్ అయ్యింది గానీ, లేదంటే ఖుష్బూ కాల్షీట్లు ఇప్పటికీ దొరికేవి కావు. బలమైన స్త్రీ పాత్రల్ని రాసుకోవడం, వాటిని సమర్థులైన నటీమణులకు అప్పగించడం త్రివిక్రమ్ కి ఇష్టం. ప్రస్తుతం మహేష్ బాబుతో ఓ సినిమా చేస్తున్నాడు త్రివిక్రమ్. స్క్రిప్టు కి దాదాపుగా లాక్ పడిపోయింది. ప్రస్తుతం నటీనటుల ఎంపిక జరుగుతోంది. ఇందులోనూ.. అత్తారింటికి దారేదిలో నదియా టైపు పాత్ర ఒకటుందని సమాచారం. అందుకోసం… మాజీ హీరోయిన్ల లిస్టు తీసుకుని, అందులో ఒకరి పేరు ఫైనల్ చేసే పనిలో ఉన్నాడు త్రివిక్రమ్. ఈసారి… ఆ మాజీ హీరోయిన్ బాలీవుడ్ నుంచి దిగి వస్తుందన్న టాక్ వినిపిస్తోంది. సిమ్రాన్ పేరు కూడా చర్చల్లో ఉందని టాక్, ఈనెల 31న ఈ చిత్రాన్ని లాంఛనంగా ప్రారంభిస్తారు. ఆ రోజే.. ఇతర నటీనటుల వివరాల్ని ఫైనల్ చేసే అవకాశాలున్నాయి. ఈ సినిమా టైటిల్ పై రకరకాల వార్తలొస్తున్నాయి. అయితే ప్రస్తుతానికి టైటిల్ అయితే ఏదీ ఫైనల్ కాలేదని సమాచారం.