ఈరోజుల్లో సినిమా అంటే డబ్బులు వెదజల్లడమే. పైగా స్టార్ హీరోతో సినిమా అంటే ఏ ఒక్కరూ ఖర్చుకి వెనుకంజ వేయడం లేదు. సినిమా అంతా రిచ్‌గా కనిపించడానికి ఎన్ని కోట్లయినా ధారబోస్తున్నారు. పక్క రాష్ట్రాల నుంచి నటీనటుల్ని, సాంకేతిక నిపుణుల్ని దిగుమతి చేస్తున్నారు. చిన్న పాత్రకైనా – పెద్ద నటుడ్ని నిలబెట్టి షో చేస్తున్నారు. త్రివిక్రమ్ కీ ఆ అలవాటు ఉంది. తన స్క్రీన్ భారీగా ఉండాలనుకుంటాడు త్రివిక్రమ్. తెర నిండా నటీనటులతో ధగధగలాడిపోవాలని ఆశ పడతాడు. దానికి తగ్గట్టుగానే పెద్దింటి కథలు ఎంచుకుంటాడు. పెద్ద పెద్ద బంగ్లాలూ, ఖరీదైన కార్లు, ఫర్నీచర్, ఆర్బాటాలూ ఇవన్నీ చూపించడం త్రివిక్రమ్‌కి ఓ సరదాగా మారిపోయింది.
దానికి తోడు నటీనటుల విషయంలోనూ రాజీ పడడం లేదు. చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలన్నట్టు చిన్న చిన్న పాత్రలకూ పెద్ద నటీనటుల్ని ఎంచుకుంటున్నాడు. ఎంపిక విషయంలో తప్పు పట్టకపోయినా – ఆ స్థాయి పాత్రలో వాళ్లు కనిపిస్తున్నారా? లేదా? అనే విషయంలో మాత్రం చాలామందికి అసంతృప్తులున్నాయి. ‘అల వైకుంఠపురములో’ చూడండి. స్టార్ కాస్ట్ మాత్రం భీకరకంగా ఉంది. టబు, జయరామ్, సముద్రఖని, మురళీ శర్మ, జేపీ, సునీల్, నివేదా పేతురాజ్, సుశాంత్… అబ్బో ఇలా చెబితే నాన్ స్టాప్ లిస్టు వచ్చేస్తుంది. మురళీశర్మ, జేపీ, జయరామ్ పాత్రలు ఓకే.
కానీ టబు, సునీల్, సుశాంత్, నివేదా పేతురాజ్… ఇవన్నీ వాళ్ల స్థాయి పాత్రలు కావు. టబుకి ఈ సినిమా కోసం ఏకంగా 3 కోట్లు ఇచ్చారని ప్రచారం జరుగుతోంది. పట్టుమని పది నిమిషాలు కూడా కనిపించని పాత్ర కోసం మూడు కోట్లు అంటే మాటలా? సునీల్ కూడా రోజువారీ లెక్కన పట్టుకెళ్లిపోయి ఉంటాడు. హీరోయిన్గా చేస్తున్న నివేదాని తీసుకొచ్చి, సైడ్ ఆర్టిస్టు పాత్ర కట్టబెట్టాడు త్రివిక్రమ్. సుశాంత్ పాత్రకీ అన్యాయం జరిగింది. అయితే వీళ్లంతా భారీ మొత్తంలోనే పారితోషికాలు రాబట్టుకుని ఉంటారు. అది వాళ్ల తప్పేం కాదు. వాళ్లకున్న స్థాయిని బట్టే ఇచ్చుంటారు.
తెరపై తారల ధగధగా ఒక్కటే సరిపోదు. వాళ్లకు తగిన పాత్రలుండాలి. ఈ విషయంలో త్రివిక్రమ్ ఈసారీ ఫెయిల్ అయ్యాడు. సినిమా హిట్టయి, డబ్బులొచ్చాయి కాబట్టి ఎవరికి ఎంతిచ్చినా, ఓకే. అదే అటూ ఇటూ అయితే… ఈ ఖర్చే ఎక్కువ కనిపించేది. అప్పుడు వేళ్లన్నీ త్రివిక్రమ్వైపు చూపించి ఉండేవి. ఈ భారీదనం, అనవసరమైన హంగుల విషయంలో త్రివిక్రమ్ కాస్త ఆలోచించుకుంటే మంచిది. నిర్మాతలు కూడా అదే అనుకుంటూ ఉండొచ్చు. కానీ త్రివిక్రమ్ కదా, బయటకు చెప్పలేరు. అంతే తేడా.