త్రివిక్రమ్ మాటల మాంత్రికుడు. తెరపై ఆయన సృష్టించిన పాత్రలే కాదు.. ఆయనా బయట అద్భుతంగా మాట్లాడతారు. మైక్ అందుకొంటే – ఆ మాటల ప్రవాహానికి అడ్డు కట్ట వేయలేం. ప్రతీసారీ.. ఆయన స్పీచ్ ఓ గుర్తుండిపోయే జ్ఞాపకం అవుతుంది. ఆయన స్పీచ్ కోసమే… ఫ్యాన్స్ ఎదురు చూస్తుంటారు. వాటిని రివైండ్ చేసుకొని మళ్లీ మళ్లీ వింటుంటారు. త్రివిక్రమ్ ఒక్కసారి మాట్లాడితే.. ఆ స్పీచ్ నుంచి వంద కొటేషన్లు పుట్టుకొస్తుంటాయి. సిరివెన్నెల సీతారామశాస్త్రి గురించి అప్పుడెప్పుడో త్రివిక్రమ్ ఇచ్చిన స్పీచ్‌కి ఇప్పటికీ.. అభిమానులు ఉన్నారు. ‘గుంటూరు కారం’ ప్రీ రిలీజ్ వేడుకలో కూడా త్రివిక్రమ్ నుంచి అలాంటి మాటల ప్రవాహాన్ని ఊహించారు అభిమానులు. అయితే ఈసారి మాటల మాంత్రికుడు మాటల్ని మరింత పొదుపుగా వాడి, అభిమానుల్ని, తన స్పీచ్ గురించి చెవులు రిక్కరించి మరీ ఎదురు చూసేవాళ్లనీ కాస్త నిరుత్సాహ పరిచాడు.
‘గుంటూరు కారం’ ప్రీ రిలీజ్ వేడుక గుంటూరులో జరిగింది. ఈ సందర్భంగా త్రివిక్రమ్ ఏం మాట్లాడతాడా? అని అంతా ఆసక్తిగా ఎదురు చూశారు. కానీ త్రివిక్రమ్ స్పీచ్ మొక్కుబడిగా ముగిసింది. ఆయన స్పీచ్‌లో కేవలం మహేష్ గురించి మాత్రమే ప్రస్తావించారు. 100కి 200 శాతం కష్టపడే హీరో మహేష్ అని కితాబు ఇచ్చారు. కృష్ణతో మహేష్‌ని పోల్చారు. ఆయన చేయకుండా మిగిల్చిన పాత్రల్ని మహేష్ చేయగలడని కితాబిచ్చారు. అతడులో మహేష్ ఎలా ఉన్నాడో, ఇప్పటికీ అలానే ఉన్నాడని, నటనలో నవ్యత్వం, యవ్వనం గోచరించాయని అన్నాడు. త్రివిక్రమ్ స్పీచ్ మహేష్ తో ఫ్యాన్స్ ఖుషీ అయ్యారు. కానీ ‘గుంటూరు కారం’ గురించి కానీ, పాటల గురించి కానీ, ఇతర ఏ విషయాల గురించి కానీ మాట్లాడకపోవడం నిరుత్సాహ పరిచింది. బహుశా.. ఈ సినిమాపై ఇప్పటికీ హైప్ పెరిగిపోయిందని, ఏం మాట్లాడినా ఆ అంచనాలు హద్దులు దాటతాయని త్రివిక్రమ్ ఓ దర్శకుడిగా జాగ్రత్త పడి ఉంటారు. అందుకే ‘మ..మ’ అనిపించారు.