అల వైకుంఠపురములో ప్రీ రిలీజ్ అనగానే అల్లు అర్జున్ స్టెప్పులు వేస్తాడా? ట్రైలర్ ఎలా ఉండబోతోంది? అనేవాటికంటే… త్రివిక్రమ్ ఏం మాట్లాడతాడు? అనే ఆసక్తే మొదలైంది. ఎందుకంటే త్రివిక్రమ్ భలే మాటకారి. ఆయన స్పీచుల కోసం ఆయన అభిమానులు ఆ స్థాయిలో ఎదురుచూస్తుంటారు. వాళ్లందరినీ త్రివిక్రమ్ ఏమాత్రం నిరాశ పరచయలేదు. తనదైన ఛమక్కులతో స్పీచ్‌ని దంచేశాడు. `మనసు దురదపెడితే గోక్కునే దువ్వెన సంగీతం` అంటూ సూపర్ పంచ్ ఇచ్చాడు. మాటల మాంత్రికుడి స్పీచ్ ఎలా సాగిందంటే.
“ఓ రూములో సోఫా మీద మధ్యాహ్నం 3 నుంచి 4 గంటల ప్రాంతంలో, దాదాపు ప్రపమంచమంతా మత్తులో ఉన్న సమయంలో, ట్రాఫిక్ కూడా పెద్దగా ఉండని సమయంలో 30 ఏళ్ల యువకుడు, 60 ఏళ్ల పెద్దాయన కూనిరాగం తీసుకుంటూ రాసుకున్న పాట ఇన్ని కోట్ల మంది హృదయాల్ని తాకింది. అదే సామజ వరగమన. వారిద్దరూ ఈ చిత్రానికి ఈ స్థాయిని తీసుకొచ్చారు. ఇది వినాలనిపించే సాయింత్రం. సంగీతం వల్ల సౌందర్యం వస్తుంది. అలాంటి సౌందర్యాన్ని.. మీ అందరికీ ఎప్పుడు వినిపిస్తాం? మా కళ్లల్లోకి వచ్చిన నీటి చుక్క మీ కళ్లల్లో ఎప్పుడు చూస్తాం? అని నేనూ ఎదురుచూశాను. ఓ గొప్ప జ్ఞాపకాన్ని ఇద్దరూ కలిసిచ్చారు. సిద్ద్ శ్రీరామ్ తన పాటతో మరింత వైభోగం తీసుకొచ్చాడు. పాటనేది ప్రేయసి లాంటిది. తన చేయి పెట్టుకుని నడవొచ్చు. మన గురువు.. మనం అజ్ఞానంలో ఉన్నప్పుడు మనల్ని ముందుకు తీసుకెళ్తుంది. అలాంటి అందమైన పాటని గౌరవించాలని మ్యూజికల్ నైట్ అని పెట్టాం.
జులాయిలో పెళ్లికాని యువకుడిగా బన్నీ నాకు తెలుసు. ఇప్పుడు ఇద్దరు పిల్లల తండ్రిగా నాకు తెలుసు. తన మెచ్యూరిటీ నాకు తెలుసు. నిన్న రాత్రి రెండు గంటల వరకూ ఇంకా పనిచేస్తూనే ఉన్నాం. మేం కన్న కల మీ అందరికీ మంచి జ్ఞాపకం అవ్వాలి. సంగీతం అంటే మనసు దురద పెడితే దువ్వుకునే దువ్వెన లాంటిది. వాడు సినిమా వాడురా అనే స్థాయి నుంచి.. ఆయన సినిమా పాట రాస్తారండీ అనేంత స్థాయి తీసుకొచ్చిన గీత రచయిత సీతారామశాస్త్రి. ఒకటి నుంచి పదో స్థానం వరకూ నాదే, పదకొండు కోసం మీరంతా కొట్టుకోండి అని తమ పాటల ద్వారా చెబుతూనే ఉన్నారు. ఈ సినిమాకి పనిచేసిన ప్రతి ఒక్కరితోనూ నేను ప్రేమలో ఉన్నాను. ఈ సినిమా విడుదలైన తరవాత కొద్ది పాటి విరహం అనుభవిస్తాను. మళ్లీ ఓ కథ రాస్తాను. మళ్లీ మీ అందరినీ కలిస్తాను. ఈసినిమాకి అన్నీ అల్లు అర్జునే. ఆయన్ని ఈసినిమా కోసం కలిసిన తొలిరోజున మనం సంతోషంగా ఓ సినిమా చేద్దాం అన్నారాయన. ఆ మాటతోనే ఈ సినిమా చేశాం. ఈ సినిమాతో నాకు మరో మంచి కూడా జరిగింది. సామజవరగమన పాట పారిస్‌లో షూటింగ్ జరుగుతున్నప్పుడు నా భార్యని కూడా తీసుకెళ్లా. రెండ్రోజులు షూటింగ్ చూసింది. ఇక మీదట షూటింగ్‌కి రాను అనిచెప్పింది. 12 వ తేదీని కలుద్దాం.. పండగ చేసుకుందాం” అన్నారు.