హైదరాబాద్: మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ – నితిన్, సమంతలతో ‘అ ఆ'(అనసూయ రామలింగం వర్సెస్ ఆనంద్ విహారి) అనే కొత్త చిత్రాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. టైటిల్ చూడగానే ఈ సినిమాలో నిర్దిష్టమైన కథ ఏదో ఉందని, సాధారణంగా చుట్టేసే రొటీన్ సినిమా కాదని అర్థమవుతోంది. అత్తారింటికి దారేది చిత్రంతో టాలీవుడ్ టాప్ రేంజ్ డైరెక్టర్లలోకి చేరుకున్న త్రివిక్రమ్, ఇప్పుడు ఒక సినిమా చేస్తానంటే మన టాప్ హీరోలందరూ కాల్షీట్లు ఇవ్వటానికి ముందుంటారనేది అతిశయోక్తి కాదు. దానికి కారణాలు – త్రివిక్రమ్ సక్సెస్ రేట్ బాగుండటం ఒకటైతే, అతని సినిమాల వలన కుటుంబ చిత్రాల ప్రేక్షకులలో పాగా వేయొచ్చనేది రెండోది. అయితే ఇంత క్రేజ్ ఉన్నాకూడా త్రివిక్రమ్ ఇప్పుడు బి గ్రేడ్ హీరో అయిన నితిన్‌తో సినిమా చేయటం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
త్రివిక్రమ్ ఈ సినిమా చేయటానికి కారణం అతను బలంగా నమ్ముకున్న స్టోరీ పాయింట్ అని టైటిల్నుబట్టే అర్థమవుతోంది. డిమాండ్ ఉందని, ఎక్కువ రెమ్యునరేషన్ వస్తుందని కథకు నప్పని టాప్ హీరోతో ఆ చిత్రాన్ని చేస్తే అది బాక్సాఫీస్ దగ్గర పేలిపోవటం ఖాయం. ఆ కథకు నితిన్ కరెక్ట్ కాబట్టే త్రివిక్రమ్ ఈ సినిమా చేస్తున్నారని తెలుస్తోంది. సాధారణంగా ఒకటి-రెండు సినిమాలు హిట్ కాగానే, దర్శకులు ఎడా పెడా సినిమాలు ఒప్పుకొంటుంటారు. అయితే త్రివిక్రమ్ అలా చేయటంలేదు. డిమాండ్‌ను క్యాష్ చేసుకుందామని పెద్ద హీరోలతో హడావుడిగా చేయకుండా నింపాదిగా తనకు తట్టిన స్టోరీ పాయింట్‌తో సినిమాను రూపొందించుకుంటూ వెళుతున్నారు. తద్వారా తన క్రియేటివిటీని ఆయన కాపాడుకుంటున్నారు. ఆయన మార్గం అభినందనీయం.
‘అ ఆ’ టైటిల్‌ను బట్టి హీరోయిన్ పేరు అనసూయ, ఆమె తండ్రి పేరు రామలింగం అని, హీరో పేరు ఆనంద్ విహారి అని తెలుస్తోంది. అసలు ఈ మధ్య త్రివిక్రమ్ శ్రీనివాస్ చిత్రాల టైటిల్స్ అన్నీ టాలీవుడ్ సంప్రదాయాల ప్రకారం ‘బాద్షా’, ‘నాయక్’, ‘దూకుడు’ వంటి హీరో బేస్డ్వి కాకుండా భిన్నంగా ఉంటున్న సంగతి తెలిసిందే. ఇంతకుముందు అత్తారింటికి దారేది, సన్ ఆఫ్ సత్యమూర్తి ఇలాగే భిన్నంగా ఉండాగా ఇప్పుడు ‘అ ఆ’ కూడా ఆ పద్ధతిలోనే ఉంది.