పైరసీ అనండి, లీకులు అనండి లేదా మరొక పేరు ఏదో ఒకటి పెట్టండి. పిలుపు ఏదైనా పెద్ద సినిమాలకు షరా మామూలుగా డ్యామేజి జరుగుతోంది. టీజర్లు, ట్రైలర్లు విడుదల కాక ముందు.. ఆ మాటకొస్తే షూటింగ్ అంతా పూర్తి కాకముందు… ఎడిటింగ్ స్టేజిలో వుండగా స్టార్ హీరోల సినిమా క్లిప్పింగులు, కీలక సన్నివేశాలకు చెందిన ఫొటోస్ బయటకు వస్తున్నాయి.
యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందుతోన్న ‘అరవింద సమేత వీరరాఘవ’ సినిమాకూ ఈ లీకుల బెడద తప్పలేదు. ఎన్టీఆర్, నాగబాబు కారులో ప్రయాణిస్తుండగా ఎవరో దాడి చేసిన సన్నివేశంలోని ఫొటోస్ ఎడిటింగ్ రూమ్ నుంచి వచ్చాయి. అవన్నీ ఫోనుల్లో తీసిన ఫొటోలే. దీనిపై త్రివిక్రమ్ గుస్సా అయ్యార్ట. సినిమా టీమ్‌కి స్ట్రిక్ట్ ఆర్డర్స్ జారీ చేశార్ట. “షూటింగ్ స్పాట్‌లోకి, సెట్లోకి ఎవరూ ఫోన్స్ తీసుకురాకూడదు. సెట్లో ఎవరూ ఫోన్స్ ఉపయోగించరాదు. ఫొటోస్ తీయరాదు” అని!
సాధారణంగా ఈమధ్య పెద్ద పెద్ద సినిమాలు అన్నిటికీ సెట్ బయట. లొకేషన్ బయట ఈ బోర్డులు పెడుతున్నారు. అయితే.. ఎవరూ ఆ బోర్డులను పట్టించుకోవడం లేదు. త్రివిక్రమ్ కంట ఒకరిద్దరు ఫోనులతో కనిపిస్తే మరోసారి ఫోనులు సెట్లోకి తీసుకు రావొద్దని గట్టిగా చెప్పారు. అలాగే, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్‌లోనూ, ఎడిటింగ్ రూమ్‌లోకి ఫోనులను అనుమతించడం లేదు.. ఇకపై సినిమా విడుదల వరకూ మరో లీక్ జరగకూడదని గట్టిగా ప్రయత్నిస్తున్నారు. హారిక అండ్ హాసిని సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమా టీజర్ ఆగస్టు 15న విడుదల కానున్న సంగతి తెలిసిందే.