అఆ తరవాత త్రివిక్రమ్ తమిళ కథానాయకుడు సూర్యతో కలసి ఓ సినిమా చేయాల్సివుంది. అయితే ఈ సినిమా ఆగిపోయినట్టు ప్రస్తుతం టాలీవుడ్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ సినిమా ఆగిపోవడానికి సూర్య మొండి వైఖరే కారణం అని తెలుస్తోంది. ఈ సినిమాని తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి తెరకెక్కించాలన్నది సూర్య నిర్ణయం. అయితే.. త్రివిక్రమ్ మాత్రం ‘దీన్ని తెలుగు సినిమాగానే తీద్దాం. కావాలంటే ఆ తరవాత తమిళంలో డబ్ చేసుకొందాం’ అన్నాడట. దానికి సూర్య ఏమాత్రం ఒప్పుకోవడం లేదని తెలుస్తోంది. తనకు తమిళంలో భారీ మార్కెట్ ఉంది. దానికి తోడు 24 సినిమా కూడా సూపర్ డూపర్ హిట్టయ్యింది. అందుకే తెలుగు తమిళ భాషల్లో వేర్వేరుగా షూట్ చేద్దామన్నాడట.
అయితే ఇక్కడే త్రివిక్రమ్‌కి మింగుడు పడడం లేదు. తెలుగు భాషపై త్రివిక్రమ్‌కి విపరీతమైన పట్టు. అందుకే డైలాగులు అలవోకగా వచ్చేస్తాయి. పంచ్‌లు పడతాయి. తమిళం అలా కాదు. అక్కడి పట్టు వేరు. తెలుగులో రాసినంత ఈజీగా తమిళంలో డైలాగ్ ఎలాగూ రాయలేడు. ఒకవేళ తర్జుమా చేసినా.. ఆ ఫన్ పండదు. అందుకే త్రివిక్రమ్ డైలామాలో పడ్డాడట. చివరికి ఈ ఆఫర్ వదిలేసినట్టు టాక్. సూర్య ఒకవేళ త్రివిక్రమ్ షరతుకు ఒప్పుకొంటే తప్ప ఈ సినిమా పట్టాలెక్కే అవకాశం లేదని టాలీవుడ్ టాక్.