త్రివిక్రమ్ మాటల రాయడంలోనే కాదు… మీడియా ముందుకు రావడంలోనూ మహా పిసినారి. మామూలుగా ఆయన ఇంటర్వ్యూలు ఇవ్వడం తక్కువ. ‘అజ్ఞాతవాసి’ ఘోర పరాజయం తరవాత అసలు కనిపించలేదు. పవన్ కల్యాణ్ హీరోగా రూపొందిన ఆ సినిమా రిజల్ట్ పట్ల త్రివిక్రమ్ స్పందన ఏంటో ఎవరికీ తెలియకుండా పోయింది. ఆయన అభిమాన రచయిత్రి యద్దనపూడి సులోచనారాణి గురించి రెండు ప్రముఖ దిన పత్రికలను పిలిచి మరీ ఇంటర్వ్యూ ఇవ్వడంతో ‘అజ్ఞాతవాసి’ గురించి అడిగే అవకాశం విలేకరులకు దక్కింది. త్రివిక్రమ్ కూడా ఆ సినిమా విషయంలో చాలా తప్పులు జరిగాయని ఒప్పుకున్నారు.
‘అజ్ఞాతవాసి’ని విశ్లేషించుకుంటే పాజిటివ్స్, నెగటివ్స్ ఏమున్నాయి? అని త్రివిక్రమ్‌ని ప్రశ్నించగా… “పాజిటివ్స్ ఏమున్నాయండి! అన్నీ నెగిటివ్సే కదా!” అని సింపుల్‌గా తేల్చేశారు. సినిమా జయాపజయాల గురించి మాట్లాడుతూ… “పరాజయానికి కుంగిపోనని చెప్పను. నేనూ మామూలు మనిషినే. అపజయం అనేది దుమ్ము లాంటిది. మనం కిందపడిన తరవాత దుమ్ము అంటుకుంటే… లేచి నీళ్ళ కోసం వెతుక్కుని స్నానం చేయాల్సిందే! ‘అజ్ఞాతవాసి’ పరాజయం నాపై ప్రభావం చూపించలేదని చెబితే అబద్ధం చెప్పినట్టే. సినిమా విషయంలో చాలా తప్పులు జరిగిపోయాయ్. ముఖ్యంగా మన ఎమోషన్ దూరం అయ్యిపోయింది. ఆ కథలోనే లోపం ఉంది. ఓ రాజు, ఓ రాజ్యం… అందరికీ తెలిసిన కథ చెబితే ప్రేక్షకులు తొందరగా లీనమయ్యేవారు. ఓ ప్రముఖ పారిశ్రామికవేత్త ముఖేశ్ అంబానీ… అతనికి ఇద్దరు కొడుకులు అంటూ కార్పొరేట్ స్టయిల్ కథ చెప్పా. అది జనాల సమస్య కాదు. బిజినెస్ పేజీకే పరిమితమయ్యే న్యూస్ ఐటెమ్ లాంటి కథ. అందుకే ప్రేక్షకులు లీనమవ్వలేదు. ఈ ప్రభావం నుంచి బయటపడడానికి మార్గం ఇంకా…ఇంకా పని చేయడమే. ప్రస్తుతం నేను అదే చేస్తున్నా” అన్నారు.