కొన్ని పరాచకాలు బాగుంటాయి. దాపరికాలు లేని మాటలు, ఛలోక్తులు – నవ్వులు విసిరేలా చేస్తాయి. వాతావరణాన్ని తేలికపరుస్తాయి. కాకపోతే… ఓ వ్యక్తి చేసిన క్రియేటివ్ వర్క్ ని కామెడీ చేయాలని చూడడం మాత్ర తప్పు. త్రివిక్రమ్ లాంటి మేధావి, తమన్ లాంటి సృజనశీలుడూ… ఇలాంటి పొరపాటు చేస్తారని అస్సలు ఊహించలేం. కానీ అది జరిగింది.
‘అల వైకుంఠపురము’లో ప్రమోషన్లు ఇంకా సాగుతూనే ఉన్నాయి. అందులో భాగంగానే…. ఓ ప్రత్యేక ఇంటర్వ్యూని రూపొందించారు. అల వైకుంఠపురములో ఆల్బమ్‌కి వచ్చిన క్రేజ్ అంతా ఇంతా కాదు. ఈ సినిమా విజయంలో తమన్ పాటలు కీలక పాత్ర పోషించాయి. అందుకే సీతారామశాస్త్రి, రామజోగయ్య శాస్త్రి, కాశర్ల శ్యామ్.. ఇలా ఈ సినిమా కోసం పాటలు రాసిన వాళ్లందరినీ కూర్చోబెట్టి ఓ ఇంటర్వ్యూ నిర్వహించారు. త్రివిక్రమ్, తమన్‌లు సైతం ఇందులో పాలు పంచుకున్నారు.
ఈ సందర్భంగా రామజోగయ్య రాసిన ‘బుట్ట బొమ్మా’ అనే పాట ప్రస్తావనకు వచ్చింది. ‘సామజవరగమన’ పాటకొచ్చిన స్పందన ఈ పాటకు రాలేదు గానీ, అందుకు ఏమాత్రం తీసి పోని గీతమిది. రామజోగయ్య చాలా బాగా రాశారు. పాట పిక్చరైజేషన్ కూడా అదిరిపోయే స్థాయిలో ఉంది. ఈ పాట గురించి మాట్లాడడం మానేసి – ఈ పాటకోసం ఇది వరకు చేసిన వెర్షన్‌ని ప్రస్తావించారు తమన్, త్రివిక్రమ్. అక్కడి నుంచి వీరిద్దరి కామెడీ మొదలైంది. అసలు రామజోగయ్య అంత చెత్త పాట ఇది వరకు రాయనట్టు, దాన్ని విని – ఎలా ఒప్పుకోవాలో తెలీక బన్నీ, త్రివిక్రమ్, తమన్ తెగ ఇదైపోయినట్టు, చివరికి బన్నీ ధైర్యం చేసి ‘ఈ పాట వద్దు’ అన్నట్టు… అది విని త్రివిక్రమ్, తమన్‌లు తెగ సంతోషపడిపోయినట్టు… ఇలా రకరకాల ఎక్స్‌ప్రెషన్స్‌తో డ్రామా పండించాలని చూశారు. ఆ పాటని పాతాళంలో దాచేయాలని అనిపించినట్టు, ఇంకెప్పుడూ బయట తీయకూడదని ఒట్టు వేసుకున్నట్టు.. తమన్ కూడా వంత పాడాడు.
ఓ గీత రచయిత రాసిన పాట గురించి, మిగిలిన గీత రచయితల సమక్షంలో – ఇంత ఓవర్ చేస్తూ మాట్లాడడం ఎవరికైనా ఇబ్బందే. ఈ సమయంలో రామజోగయ్య కూడా కాస్త ఇబ్బంది పడినట్టు కనిపించింది. అయితే ఆయనే తేరుకుని ‘మరీ అంత చెత్త పాట కాదు.. మనపై మనకు బాధ్యత పెరిగి.. ఇంకాస్త మంచి పాట చేద్దామనుకున్నాం. ఆ పాట ట్యూనింగ్, ఆర్కెస్ట్రైజేషన్ అన్నీ బాగున్నాయి’ అంటూ కాస్త బాధ్యతా యుతంగా మాట్లాడాడు.
ఓ పాటకు అనేక వెర్షన్లు రాయిస్తుంటారు. పాట రికార్డు చేసిన తరవాత కూడా పక్కన పెట్టాల్సివస్తుంటుంది. ఇవన్నీ తమన్, త్రివిక్రమ్‌లకు తెలియంది కాదు. పాట నచ్చకపోతే…’మరో పాట రాయండి’ అని చెప్పేంత ధైర్యం, తెగువ, చనువు త్రివిక్రమ్‌కి కాకపోతే ఎవరికి ఉంటుంది? ఆ మాత్రం చెప్పొచ్చుగా. ఓ పాటని ఎలా ఒప్పుకోవాలో తెలీక అంత మధన పడుతున్నట్టు ఈ బిల్డప్పు ఇవ్వడం ఎందుకు? ఇదంతా కామెడీ అని త్రివిక్రమ్, తమన్ అనుకుని ఉండొచ్చు. కానీ ఓ రచయితని ఎదురుగా కూర్చోబెట్టుకుని, మిగిలిన రచయితల సమక్షంలో చులకనచేయాలని చూడడం అవుతుందని ఓ రచయితగా త్రివిక్రమ్ తెలుసుకోకపోవడం విచిత్రం.