ఎన్టీఆర్ – త్రివిక్రమ్ సినిమా ఆగిపోయింది. ఎన్టీఆర్, కొరటాలతోనూ, త్రివిక్రమ్ మహేష్ తోనూ సినిమా చేయబోతున్నారు. పరస్పర అంగీకారంతో, ఓ ఆరోగ్య కరమైన వాతావరణంలోనే ఈ సినిమా ఆగిపోయింది. అయితే.. ఇప్పుడు త్రివిక్రమ్ అడ్వాన్స్ తిరిగి ఇచ్చేయాలట. అది కూడా వడ్డీతో.
ఎన్టీఆర్ – త్రివిక్రమ్ సినిమాని హారిక హాసిని సంస్థ నిర్మించాల్సివుంది. అది త్రివిక్రమ్ సొంత సంస్థే. అక్కడ అడ్వాన్సుల మాటే లేదు. కానీ ఈ సినిమాలో ఎన్టీఆర్ ఆర్ట్స్ కూడా చేతులు కలిపింది. నందమూరి కల్యాణ్ రామ్ భాగస్వామి. తన చేతుల నుంచి త్రివిక్రమ్ కి కోటి రూపాయల అడ్వాన్స్ ఇచ్చారని టాక్. ఆ కోటి, వడ్డీతో సహా తిరిగి ఇవ్వాల్సిన బాధ్యత త్రివిక్రమ్ పై పడింది. త్రివిక్రమ్ కి అదేమంత లెక్క కాదు. కానీ… ఓ నిర్మాత దగ్గర్నుంచి తీసుకున్న అడ్వాన్స్ తిరిగి, వడ్డీతో సహా ఇవ్వాల్సిన పరిస్థితి రావడం త్రివిక్రమ్ కెరీర్లోనే ఇదే మొదటి సారి కావొచ్చు. ఇప్పడు ఎన్టీఆర్ – కొరటాల సినిమా కూడా.. కల్యాణ్ రామ్ కి అప్పగిస్తాడా, లేదా? అనే ఓ అనుమానం ఉంది. కల్యాణ్ రామ్ ఈ సినిమాని ఎలాగైనా వదులుకోకూడదని భావిస్తున్నాడు. అన్నీ కుదిరితే.. నిర్మాత జాబితాలో కల్యాణ్ రామ్ పేరు కూడా చూడొచ్చు. ఈరోజు సాయింత్రానికి ఎన్టీఆర్ – కొరటాల శివ సినిమాకు సంబంధించి ఓ అధికారిక ప్రకటన వస్తుంది.