త్రివిక్రమ్ – వెంకటేష్ కాంబినేషన్ చిత్రసీమకు షాక్ ఇచ్చేదే. ఆల్మోస్ట్ ఈ కాంబోలో సినిమా రాదు అని ఫిక్సయిపోయిన తరుణంలో.. సడన్ గా ఎనౌన్స్మెంట్ వచ్చేసింది. త్రివిక్రమ్ పంచ్‌లకు, వెంకీ కామెడీ టైమింగ్‌కి పర్ఫెక్ట్ జోడీ కుదిరిపోతుంది కాబట్టి – ఈ సినిమాపై ఆశలు, అంచనాలు అదే స్థాయిలో పెరగడం ఖాయం. అయితే… ఈ సినిమా ఓ రీమేక్ అని, ‘జాలీ ఎల్ ఎల్ బీ 2’ని తెలుగులో వెంకీతో తీయబోతున్నారని తెలిసి.. అంతే షాక్‌కి గురవుతున్నారు సినీ జనాలు.
కారణం… జాలీ ఎల్ ఎల్ బీ తో పోలిస్తే. పార్ట్ 2 ఏమంత మెప్పించలేదు. అక్షయ్ చేశాడని తప్ప.. పెద్దగా చెప్పుకోవడానికి ఏం లేదు. కథ పరంగా మెరుపులేం ఉండవు. కథనం కూడా అంతంత మాత్రమే. కామెడీ పండిందీ తక్కువే. పోయి పోయి అలాంటి కథని తెలుగులో త్రివిక్రమ్ ఎందుకు రీమేక్ చేస్తాడు??? అయితే హారిక హాసిని దగ్గర జాలీ ఎల్ ఎల్ బీ 2 రైట్స్ ఉన్నాయి. వాళ్లు తీసుకొందీ వెంకీ కోసమే. వెంకీకి రీమేక్‌లంటే చాలా ఇష్టం. పైగా.. ఈ సినిమాని చాలా తక్కువ టైమ్‌లో, తక్కువ బడ్జెట్ లో తీసేయొచ్చు. ఇవన్నీ పరిగణలోకి తీసుకొనే ఈ ప్రాజెక్టుని ఓకే చేశారని తెలుస్తోంది. పాయింట్ అదే అయినా.. త్రివిక్రమ్ తనదైన కామెడీ మిక్స్ చేయబోతున్నాడని తెలుస్తోంది. అయితే.. జాలీ ఎల్ ఎల్ బీ 2 పని.. త్రివిక్రమ్ ఇంకా మొదలెట్టలేదు. అజ్ఞాతవాసి పూర్తవ్వగానే.. ఎన్టీఆర్‌తో సినిమా ఉంటుంది. ఆ తరవాత వెంకీ సినిమా పనులు మొదలవుతాయి. అప్పటికి జాలీ ఎల్ ఎల్ బీ 2 ఇంకా పాతదైపోతుంది. ఈలోగా త్రివిక్రమ్ ఆలోచనలు మారే అవకాశాలున్నాయి. వెంకీతో ఎప్పుడు సినిమా చేసినా… తక్కువ బడ్జెట్లో అంటే.. పారితోషికాలన్నీ మినహాయించుకుని రూ.10 కోట్లలోపు సినిమా పూర్తి చేయాలన్న ఆలోచనలో నిర్మాత ఉన్నట్టు తెలుస్తోంది. వాళ్లకు జాలీ ఎల్ ఎల్ బీ ఓ ఆప్షన్ మాత్రమే. అంతకంటే మంచి కథ దొరికితే.. ఈ రీమేక్ పక్కకెళ్లిపోతుంది.