అజ్ఞాతవాసి విడుదలకు మరో ఐదు రోజుల సమయం కూడా లేదు. కానీ ఇప్పటి వరకూ ట్రైలర్ బయటకు రాలేదు. బహుశా ఓ బడా హీరో సినిమా ట్రైలర్ విషయలో ఇంత జాప్యం జరగడం ఇదే తొలిసారి… చివరిసారి కావొచ్చు. ట్రైలర్ రెడీ అయిపోయింది. వదిలేయడానికి సిద్ధం. కాకపోతే… త్రివిక్రమ్ కావాలని హోల్డ్‌లో పెట్టినట్టు టాక్. ఈరోజు ట్రైలర్ విడుదల అవుతుందన్న ఊహాగానాలున్నాయి. అయితే… ట్రైలర్‌ని ఈరోజు విడుదల చేయాలా? రేపు ఉదయం వదలాలా?? అనే విషయంలో త్రివిక్రమ్ ఇంకా ఓ క్లారిటీకి రాలేదని, త్రివిక్రమ్ మూడ్‌ని బట్టి ఏక్షణంలో అయినా విడుదల అయిపోవొచ్చని తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమాపై చాలా హైప్స్ ఉన్నాయి. ట్రైలర్‌తో అవి మరింతగా పెరిగిపోతాయేమో అని త్రివిక్రమ్ భావిస్తున్నాడట.
ట్రైలర్ ఆలస్యం కావడానికి మరో బలమైన వాదన కూడా వినిపిస్తోంది. ఇప్పటికే ఈ ఇది కాపీ సినిమా అనే ప్రచారం బాగా సాగుతోంది. ట్రైలర్‌లోని కొన్ని షాట్లు, డైలాగులు చూశాక… జనాలు ఇది కాపీనే అనే నిర్దారణకు వచ్చేస్తారేమో అన్నది త్రివిక్రమ్ భయం కావొచ్చు. సినిమా విడుదలకు ముందు ఇంటర్వ్యూలు ఇవ్వడం పరిపాటి. కానీ త్రివిక్రమ్ మాత్రం ఈసారి ఇంటర్వ్యూలకు దూరంగా ఉండాలని భావిస్తున్నాడని సమాచారం.