పులివెందుల ఎమ్మెల్యే జగన్ రాఖీ శుభాకాంక్షలు ట్రోల్ అవుతున్నాయి. రాజకీయంగా , ఆర్థికంగా , సామాజికంగా మహిళలు మరింత ఎదగాలని , ఈ ప్రయాణంలో మీకు ఎల్లపుడూ తోడుగా ఉంటానని ట్వీట్ చేయడమే ఇందుకు కారణం.
సొంత చెల్లి షర్మిలకు రాజకీయంగా, ఆర్థికంగా న్యాయం చేయని జగన్… మహిళలు అన్ని రంగాల్లో ఎదిగేందుకు ఎల్లప్పుడూ తోడుగా ఉంటానని ట్వీట్ చేయడం బిగ్గెస్ట్ జోక్ అంటూ సోషల్ మీడియాలో టీడీపీ శ్రేణులు కామెంట్స్ చేస్తున్నాయి. ఆస్తిలో వాటా ఇవ్వకుండా, రాజకీయంగా ప్రోత్సహించేందుకు రాజ్యసభ ఇస్తామని హామీ ఇచ్చి షర్మిలను జగన్ మోసం చేశాడని, బాబాయ్ వివేకా హత్య కేసులో మరో చెల్లి సునీతకు అండగా ఉంటానని నిందితుల పక్షం వహించాడని విమర్శిస్తున్నారు.
2019లో వైసీపీ అధికారంలోకి రావడంలో షర్మిల పాత్రను కొట్టిపారయలేం..జగన్ అరెస్ట్ సమయంలో వైసీపీ బాధ్యతలు తన భుజనా వేసుకొని క్యాడర్ కు షర్మిల అండగా నిలిచింది. తల్లి విజయమ్మతో కలిసి ఎన్నికల సమయంలో ఊరువాడ తిరిగి వైసీపీ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం నిర్వహించింది. తీరా వైసీపీ అధికారంలోకి వచ్చాక షర్మిలను జగన్ పూర్తిగా దూరం పెట్టారు.
దీంతో తన సొంత చెల్లికి రాజకీయంగా, ఆర్థికంగా న్యాయం చేయలేని జగన్.. రాష్ట్రంలోని మహిళలకు అండగా ఉంటారా..? అని టీడీపీ శ్రేణులు ప్రశ్నిస్తున్నాయి. జగన్ నైతికత కోల్పోయారని, ఆయన మాటలకు, చేతలకు ఏమాత్రం పొంతన ఉండటం లేదని.. ఇందుకు వైఎస్ ఫ్యామిలీ తగాదాలే సాక్ష్యమని కామెంట్స్ చేస్తున్నారు.