2023 ఏప్రిల్ లో విడుదలైంది ‘ఏజెంట్’. అఖిల్ కెరీర్లో అతి పెద్ద డిజాస్టర్. ఆ తరవాత సురేందర్ రెడ్డి, అఖిల్ ఇద్దరూ సినిమాలే చేయలేదు. రెండేళ్ల తరవాత ఓటీటీలో విడుదలైంది. ఈ సినిమా ఓటీటీలో ఎప్పుడొస్తుందా? అని చాలామంది ఎదురు చూశారు. సినిమాపై ప్రేమతో కాదు. ‘అసలు అంతగా డిజాస్టర్ అయ్యేంత ఈ సినిమాలో ఏముందా’ అని. ఇప్పుడు వాళ్లందరికీ సినిమా అందుబాటులోకి వచ్చింది. సినిమా చూశాక.. ఊరికే ఉంటారా? మళ్లీ ట్రోలింగ్ ఆట మొదలెట్టేశారు. ‘ఏజెంట్’ సినిమాల్లోని ఆణిముత్యాల్లాంటి సీన్లు, డైలాగులు, ఎక్స్ప్రెషన్లూ.. అన్నీ ఏరి కోరి సోషల్ మీడియాలో బిట్లు బిట్లుగా వదులుతున్నారు. అవన్నీ ఇప్పుడు మళ్లీ వైరల్ అవుతున్నాయి. లాజిక్ లేని సీన్లు, అమీర్ పేట్ క్వాలిటీతో దింపిన వీఎఫ్ఎక్స్ షాట్స్.. ఈ సినిమా డిజాస్టర్ కి నూటికి నూరు పాళ్లూ అర్హమైనదే అని చాటి చెబుతున్నాయి.
సినిమా విడుదలైన నెల రోజుల్లోనే ఓటీటీలో దర్శనమివ్వడం చాలా కామన్. కానీ `ఏజెంట్` విషయంలో అలా జరగలేదు. ఓటీటీ సంస్థకూ, నిర్మాతకూ మధ్య కొన్ని సెటిల్మెంట్ కాని విషయాలు ఇబ్బంది పెట్టాయి. ఫైనాన్స్ సమస్యలు మామూలే. ఈ గొడవలన్నీ తొలగించుకొని విడుదల అయ్యే సరికి రెండేళ్లు పట్టింది. విచిత్రం ఏమిటంటే.. ఈ రెండేళ్ల పాటు సినిమాలేం చేయకుండా ఖాళీగా ఉన్న అఖిల్… సరిగ్గా ఓటీటీలో తన ఏజెంట్ స్ట్రీమ్ అయిన రోజే కొత్త సినిమా షూటింగ్ మొదలు పెట్టాడు. సురేందర్ రెడ్డి కొత్త సినిమా కూడా ఇప్పుడిప్పుడే ఓ కొలిక్కి వస్తుంది. ‘ఏజెంట్’ లాంటి గట్టి జర్క్ తరవాత.. వీరిద్దరూ కమ్ బ్యాక్ ఇవ్వడం చాలా అవసరం.