వైసీపీలో అన్ని తానై వ్యవహరించే సజ్జల రామకృష్ణారెడ్డి కౌంటింగ్ రోజున మీడియా కంట కనిపించకుండా జాగ్రత్తపడ్డారు. కౌంటింగ్ మొదలైన సమయం నుంచి ఏ దశలోనూ కూటమికి వైసీపీ పోటీనివ్వకపోవడం, ఫలితాలు ఊహించని స్థాయిలో రావడంతోనే మీడియాకు సజ్జల దూరంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఓ దశలో ఈ దారుణ పరాభవంతో జగన్ సైతం మీడియా ముందుకు వస్తారా అనే అనుమానాలు వ్యక్తం అయ్యాయి.
జగన్ మనస్తత్వం తెలిసిన చాలామంది ఈ ఫలితాలపై స్పందించేందుకు ఇప్పటికప్పుడు మీడియా ముందుకు జగన్ రారని భావించారు. ఆయన స్థానంలో సజ్జలతో ప్రెస్ మీట్ ఏర్పాటు చేయిస్తారని అంచనా వేశారు కానీ , అనూహ్యంగా సాయంత్రం జగనే మీడియా ముందుకు వచ్చి ఈ ఫలితాలను ఊహించలేదని నిర్వేదం వ్యక్తం చేశారు. వైసీపీ నేతలెవరూ ఊహించని విధంగా ఫలితాలు రావడంతో ఆ పార్టీ నేతలు మీడియాకు దూరంగా ఉన్నారు.
ముఖ్యంగా సజ్జల ఎటువెళ్ళారు..? విజయం మాదేనని ధీమా వ్యక్తం చేసిన సజ్జల..ఈ ఫలితాల తర్వాత ఆయన ముఖచిత్రం ఏమిటో అంటూ టీడీపీ శ్రేణులు సోషల్ మీడియాలో ట్రోల్స్ మొదలు పెట్టాయి. వైసీపీ అధికారంలో ఉన్నన్నాళ్ళు చక్రం తిప్పిన సజ్జల.. పార్టీ ఓటమి పాలయ్యేసరికి మీడియా ముందుకు వచ్చేందుకు కూడా వెనకడుగు వేస్తున్నారని అభిప్రాయపడుతున్నారు.