విశాఖ శారదా పీఠాన్ని దర్శించుకోని మంత్రులకు కష్టాలు రావడం ఖాయమట. సీఎంజగన్‌కు స్వరూపానంద మాటలపై గురి ఉంది కాబట్టి ఆయన వ్యతిరేకంగా చెబితే ఇబ్బంది అవుతుందని.. అందుకే ఆయనను కలిసి సాష్టంగ ప్రమాణం చేసి కాస్త ఫలపుష్పాలు సమర్పించుకుంటే అంతే మంచే జరుగుతుందన్న ఓ ప్రచారం ఊపందుకుంది. ఎందుకైనా మంచిదని ఇప్పటికే చాలా మంది మంత్రులు స్వరూపానంద వద్దకు వెళ్లి సాష్టంగా ప్రమాణాలు చేసి వచ్చారు. .
ఏపీ కొత్త మంత్రివర్గంలో సమాచారశాఖా మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్, పౌర సరఫరాలశాఖా మంత్రి కారుమూరి నాగేశ్వరరావు, మత్స్యకారశాఖ మంత్రి సీదిరి అప్పలరాజు, దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ, పర్యాటక శాఖా మంత్రి రోజా, పరిశ్రమలశాఖ మంత్రి గుడివాడ అమర్ నాథ్, పంచాయితీ రాజ్‌శాఖ మంత్రి ముత్యాల నాయుడు, వైద్యారోగ్య శాఖ మంత్రి విడదల రజని ఇప్పటివరకూ విశాఖ శారదా పీఠానికి చేరుకుని స్వరూపానందేంద్ర స్వామి కాళ్లపై పడి ఆశీర్వాదాలు తీసుకున్నవారిలో ఉన్నారు.
ప్రమాణం చేసినప్పుడు.. సీఎం జగన్ కాళ్లకు ఎవరెవరు నమస్కారం పెట్టారో లెక్కలేసి మరీ ఆస్థాన పత్రికలో ప్రచురించినట్లుగా స్వరూపానంద దగ్గరకు వెళ్తున్న వారి పేర్లుకూడా రాసుకుంటున్నారని.. వెళ్లని వారి పేర్లను లిస్టవుట్ చేసుకుంటున్నారని అంటున్నారు. అలాంటి వారికి మాట సాయం ఉండదని.. పైగా వ్యతిరేక ఫీడ్ బ్యాక్ వెళ్తుందన్న ఓ లీక్ వారి సర్కిల్స్‌లోకి పంపుతున్నారు. ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అమితంగా విలువిస్తున్న నేపథ్యంలో విశాఖలోని శారదా పీఠానికి ఈ మధ్య కాలంలో ప్రాముఖ్యత బాగా పెరిగిపోయింది. సాధారణంగా మంత్రులకే సీఎం వద్ద అపాయింట్మెంట్ దొరకడం అంత సులభం కాదనే పేరుంది. దానితో తమ కష్టాలూ, విజ్ఞప్తులూ విశాఖ వచ్చి స్వామీజీకి చెప్పుకుంటే ఆయనే ముఖ్యమంత్రి జగన్ దృష్టికి తీసుకు వెళతారని వైఎస్సార్సీపీ నేతలలో నమ్మకం ఏర్పడుతోంది.