రాష్ట్ర విభజన కారణంగా ఏర్పడిన సమస్యలను పరిష్కరించి రెండు రాష్ట్రాలను అభివృద్ధి చేస్తాయని భావించి ప్రజలు తెదేపా, తెరాసలకు అధికారం కట్టబెడితే, అవి సుమారు ఏడాదిన్నర పాటు కయ్యాలతో కాలక్షేపం చేయడం చూసి ప్రజలు కూడా విసుగెత్తిపోయారు. ఓటుకి నోటు కేసుతో వారి యుద్ధాలు పరాకాష్టకు చేరుకొన్నాయి. ఆ తరువాత ఒక కేంద్రమంత్రి ఇద్దరు ముఖ్యమంత్రుల మధ్య రాజీ కుదిర్చినట్లు వార్తలు వచ్చాయి. దానిలో భాగంగానే చంద్రబాబు నాయుడు హైదరాబాద్ ని, దానితో బాటే తెలంగాణాలో తన పార్టీని కూడా విడిచిపెట్టేసి విజయవాడ తరలివచ్చేసినట్లు గుసగుసలు వినిపించాయి. అప్పటి నుంచే మళ్ళీ రెండు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య కొంత సఖ్యత, ప్రశాంతత ఏర్పడ్డాయి.
తెలంగాణాలో తెరాసకి సవాలు విసురుతున్న తెదేపాను క్రమంగా నిర్వీర్యం చేయడానికి తెరాసకు వీలు కల్పిస్తూ చంద్రబాబు పక్కకి తొలగిపోవడానికి సిద్దపడటంతో రెండు రాష్ట్రాల మధ్య ప్రశాంత వాతావరణం ఏర్పడింది. అంటే ఈ సమస్యకి మూలకారణం తెలంగాణాలో తెదేపా నిలిచి ఉండటమేనని అర్ధమవుతోంది. ఆ కారణంగానే సామరశ్యంగా పరిష్కరించుకోదగ్గ విభజన సమస్యలని భూతద్దంలో చూపిస్తూ తెరాస ప్రభుత్వం చంద్రబాబు నాయుడిపై కత్తులు దూసినట్లు అర్ధమవుతోంది. ఓటుకి నోటు కేసు యుద్ధం ముగిసిన తరువాత మళ్ళీ రెండు రాష్ట్రాల మధ్య ప్రశాంత ఏర్పడింది కానీ అది మూన్నాళ్ళ ముచ్చటగా మారింది.
పాలమూరు ప్రాజెక్టుని వ్యతిరేకిస్తూ జగన్మోహన్ రెడ్డి మూడు రోజులు నిరాహార దీక్షకు కూర్చొంటానని ప్రకటించినప్పటి నుండి మళ్ళీ ఇరు రాష్ట్రాల మధ్య గొడవలు మొదలయ్యాయి. జగన్ ఎంచుకొన్న సమస్య చాలా సహేతుకంగా ఉండటంతో దానికి చంద్రబాబు కూడా కాదనలేని పరిస్థితి కల్పించారు. తెలంగాణా ప్రభుత్వం దిగువనున్న ఆంద్రా నీటి అవసరాలను ఏమాత్రం పట్టించుకోకుండా ప్రాజెక్టు నిర్మాణానికి పూనుకోవడమే కాకుండా, దానిపై అభ్యంతరాలు తెలిపినందుకు తిరిగి చంద్రబాబుపై ఎదురు దాడి కూడా చేస్తోంది.
సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకొనే ప్రయత్నం చేయకుండా, ఆంధ్రా ప్రభుత్వంతో కత్తులు దూయడానికే మ్రోగ్గు చూపడంతో రెండు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య మళ్ళీ యుద్ద వాతావరణం ఏర్పడింది. దీనితో చంద్రబాబు పని వ్రతం చెడ్డా ఫలం దక్కనట్లు అయ్యింది. తెలంగాణాలో తన పార్టీని పణంగా పెట్టినా చంద్రబాబుకి ప్రశాంతత కరువయింది. ఇటువంటి పరిస్థితి మళ్ళీ ఎదురవుతుందని ఆయన ముందే ఊహించి ఉండరు. లేకుంటే తెలంగాణాలో తన పార్టీని పణంగా పెట్టి ఉండరు. చేతులు కాలిన తరువాత ఇప్పుడు ఆకులు పట్టుకొని ప్రయోజనమేమీ ఉండదు.
చంద్రబాబు నాయుడికి ఇప్పుడు ఒక పక్క తెలంగాణా ప్రభుత్వంతో సమస్యలు, మరో పక్క కేంద్రంతో సమస్యలు వాటికి తోడు పక్కలో బల్లెంలాగ జగన్మోహన్ రెడ్డి ఉండనే ఉన్నారు. ఇవి సరిపోవన్నట్లు రాజధాని నిర్మాణం, పంట రుణాల మాఫీ, రాష్ట్రాభివృద్ధి వంటి హామీలు గుదిబండల్లా ఆయన మెడకు వ్రేలాడుతూనే ఉన్నాయి. ఈ సమస్యలన్నిటినీ అధిగమించాలంటే ఒకటే మార్గం కనిపిస్తోంది. అదే…కేంద్రం సహాకారం. కనుక ప్రత్యేక హోదా తదితర హామీల గురించి వెనక్కి తగ్గి దానితో రాజీకి ప్రయత్నిస్తారేమో? చంద్రబాబు నాయుడు ఏమి చేస్తారో చూడాలి.