తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్… ముందస్తు ఎన్నికల విషయంలో జెట్ స్పీడ్‌తో ఉన్నారు. ఇలా అసెంబ్లీని రద్దు చేసి.. అలా గవర్నర్‌కు తీర్మానం ఇచ్చి.. మళ్లీ అలా తెలంగాణ భవన్‌కు వచ్చి 105 మంది అభ్యర్థుల్ని ప్రకటించేశారు. ముందుగా చెప్పినట్లుగా సిట్టింగ్‌లందరికీ దాదాపుగా టిక్కెట్లు ఇచ్చారు. ఇద్దరికి మాత్రమే మొండి చేయి చూపారు. చెన్నూరు ఎమ్మెల్యే నల్లాల ఓదేలు, ఆందోల్ ఎమ్మెల్యే బాబూమోహన్ కు మాత్రం టిక్కెట్లు నిరాకరించారు. బాబూమోహన్ ప్రాతినిధ్యం వహిస్తున్న ఆంధోల్ నుంచి.. జర్నలిస్ట్ క్రాంతికి టిక్కెట్ ఇచ్చారు.
మంచి మనసుతో.. మంచి ముహుర్తంతో నిర్ణయం తీసుకుంటే మంచి ఫలితాలు వస్తాయని.. కేసీఆర్ వ్యాఖ్యానించారు. నాలుగు రాష్ట్రాలతో పాటు నవంబర్లోనే ఎన్నికలు వస్తాయని.. కేసీఆర్ ఆశాభావం వ్యక్తం చేశారు. అసెంబ్లీని ఎందుకు రద్దు చేయాల్సి వచ్చిందన్న దానిపై కేసీఆర్ స్పష్టమైన ప్రకటన చేయలేదు. కానీ తెలంగాణ మాత్రం.. ఈ నాలుగున్నరేళ్లలో దేశంలో మరే రాష్ట్రం సాధించనంత అభివృద్ధి సాధించిందని చెప్పుకొచ్చారు.
అభ్యర్థుల్ని ప్రకటించిన కేసీఆర్ సాయంత్రం కేసీఆర్ ఫామ్‌హౌస్‌కు వెళ్తారు. శుక్రవారం రోజున అంటే రేపే ప్రచారం ప్రారంభించబోతున్నారు. సిద్ధిపేట జిల్లా హుస్నాబాద్‌లో నిర్వహించబోయే భారీ బహిరంగ సభతో ఎన్నికల సమరానికి టీఆర్ఎస్ అధినేత శంఖారావం పూరించనున్నారు. రేపు కోనాయపల్లి వెంకటేశ్వరస్వామిని దర్శించుకుంటారు. ఆ తర్వాత హుస్నాబాద్ బహిరంగ సభలో పాల్గొంటారు. గత ఎన్నికల ప్రచారం కూడా అక్కడి నుంచే ప్రారంభించారు.