టీఆర్ఎస్ అధినేత కేసీఆర్… మ్యానిఫెస్టో రూపకల్పన కోసం.. సీనియర్ నేత కేకే నేతృత్వంలో కమిటీ వేశారు. రెండు, మూడు సార్లు సమావేశం జరిపి.. పలు వర్గాల నుంచి విజ్ఞప్తులు తీసుకుని.. కేకే కమిటీ కొన్ని ప్రతిపాదనలు సిద్ధం చేసింది. వీటిని ఈ రోజు కేసీఆర్‌కు సమర్పించబోతున్నారు. మేనిఫెస్టో కమిటీ భేటీకి కేసీఆర్ తొలి సారి హాజరు కాబోతున్నారు. ఇప్పటి వరకు మ్యానిఫెస్టో కమిటీకి ప్రజల నుంచి వచ్చిన సూచనలు, సలహాలు, విజ్ఞప్తులపై ఈ సమావేశంలో చర్చిస్తారు. ఆ తర్వాత కేసీఆర్ మీడియా సమావేశంలో ప్రధానమైన హామీలను ప్రకటించే అవకాశం ఉంది.
టీఆర్ఎస్ అభ్యర్థులు ప్రజల్లో తిరుగుతూ విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నందున … ప్రజలకు ఇచ్చే హామీలను కూడా ప్రజల్లోకి తీసుకుపోవాలంటే.. మేనిఫెస్టోను వీలైనంత త్వరగా ప్రకటించాలని కేసీఆర్ నిర్ణయించారు. అందుకే పూర్తి మానిఫెస్టో సిద్ధమయ్యే లోగా, ఇప్పటికే నిర్ణయించిన కొన్ని ముఖ్యమైన హామీలను వెల్లడించాలని కేసీఆర్ భావిస్తున్నారు. మంగళవారం జరిగే మానిఫెస్టో కమిటీ సమావేశంలో చర్చించి.. మినీ మానిఫెస్టో ప్రకటించాలని పార్టీ నిర్ణయించింది. రుణమాఫీ హామీని మరోసారి ఇవ్వడం ఖాయంగా కనిపిస్తోంది. అయితే ఏక కాల రుణమాఫీ చేయాలా.. లేదంటే గతంలో లాగా విడతల వారీగా రుణమాఫీ చేయాలా అనే విషయాన్ని కేసీఆర్‌కే అప్పగిస్తున్నారు. ఎంత మొత్తం రుణమాఫీ చేయాలన్నది కూడా కేసీఆరే నిర్ణయిస్తారు. నిరుద్యోగభృతి పై కూడా మ్యానిఫెస్టో కమిటీ కసరత్తు చేసింది. పెన్షన్లు పెంచుతామని కేసీఆర్ సభల్లో ప్రకటిస్తున్నారు.
ఇక డబల్ బెడ్ రూం స్కీం ను కొనసాగిస్తూనే .. అందులో కొన్ని మార్పులు, చేర్పులు ప్రకటించే అవకాశం ఉంది. అగ్ర వర్ణాల పేదలకు కార్పొరేషన్ ఏర్పాటు, సాంకేతిక విద్యను అభ్యసించిన వారికి ల్యాప్ టాప్ లు అందించటం లాంటి పథకాలు కూడా ఉండబోతున్నాయి. రాహుల్ గాంధీ.. రూ. 2 లక్షల ఏక కాల రుణమాఫీ చేస్తామని చెబుతున్నారు. రూ. 3వేల నిరుద్యోగ భృతి కూడా ఇస్తామంటున్నారు. వీటిని తలదన్నేలా మేనిఫెస్టోను కేసీఆర్ ప్రకటించడం ఖాయంగా కనిపిస్తోంది.