బీజేపీతో యుద్ధమేనని కేసీఆర్ పార్టీ కార్యవర్గ సమావేశంలో ప్రకటించారు. ఆ యుద్ధాన్ని వేగంగా ప్రారంభించేశారు కూడా. హైదరాబాద్‌లోని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద ఇంటిపై టీఆర్ఎస్ కు చెందిన వందలాది మంది కార్యకర్తలు దాడి చేసి బీభత్సం సృష్టించారు. హై సెక్యూరిటీ జోన్ అయిన ఎమ్మెల్యే కాలనీలో ఉన్న ఇంట్లోకి వందల మంది కార్యకర్తలు చొరబడుతూంటే పోలీసులు చోద్యం చూస్తూ ఉన్నారు. చేయాల్సిన విధ్వంసం చేసిన తర్వాత పోలీసులు వచ్చి వారిని పంపేశారు.
ఈ విధ్వంసం పూర్తవగానే.. కల్వకుంట్ల కవిత తెలంగాణ భవన్లో ప్రెస్ మీట్ పెట్టి అర్వింద్‌కు హెచ్చరికలు జారీ చేశారు. పరిధి దాటి మాట్లాడితే మెత్తగా కొట్టి చంపుతామని హెచ్చరించారు. మాటలు మీరితే నిజామాబాద్ చౌరస్తాలో చెప్పుతో కొడతామన్నారు. కవిత ఓ నేతపై అలా మాట్లాడటానికి కారణం… కాంగ్రెస్‌లో చేరేందుకు కవిత ప్రయత్నించారని ఎంపీ అర్వింద్ గురువారం ప్రకటించడమే. బీజేపీలో చేరాలని కవితను ఆహ్వానించారని కేసీఆర్ అన్న మాటలకు అర్వింద్ ఇలా కౌంటర్ ఇచ్చారు. అయితే ఇది భౌతిక దాడులకు దారి తీసింది.
కవిత కూడా కేసీఆర్ మాటలను సమర్థించారు.బీజేపీ నుంచి తనకు ఆఫర్ వచ్చిన మాట నిజమేని.. షిండే మోడల్ ఇక్కడ అమలు చేయడం పై మాట్లాడారన్నారు. ” షిండే మోడల్ ” అంటే.. మహారాష్ట్రలో ఏక్నాథ్ షిండే .. శివసేనకు చెందిన ఎమ్మెల్యేలను తనతో పాట తీసుకు పోయి.. తనదే శివసేన అని ప్రకటించుకున్నట్లుగా రాజకీయం మార్చడం. కవితను అలా షిండే తరహాలో రాజకీయం చేయాలన్న ఆఫర్ ఇచ్చినట్లుగా కవిత చెప్పారు.
మరో వైపు దాడుల అంశాన్ని బీజేపీ సీరియస్‌గా తీసుకుంది… తన ఇంటిపై దాడి చేసి తల్లిని బెదిరించారని.. ప్రధానికి..హోంమంత్రికి.. ఫిర్యాదు చేశారు అర్వింద్. కేసీఆర్ కుటుంబానికి కుల అహంకారం పెరిగిందన్నారు.