తెలంగాణ రాష్ట్ర సమితి ఇప్పటికీ అదే ఎమోషనల్ అస్త్రాన్ని వదిలినట్టు లేదు! తెలంగాణ ఉద్యమం, ఆ క్రమంలో ప్రజల్ని ఏకం చేయడం కోసం అనుసరించిన తీరునే ఇప్పటికీ కొనసాగిస్తోంది. అధికారంలోకి వచ్చి ఇన్నాళ్లు అవుతున్నా… ఇంకా ప్రజల ఎమోషన్స్ మీదే తెరాస ఆధారపడుతోంది. అంతేగానీ, తమ పాలన ద్వారా సాధించిన ఫలితాలపై నమ్మకం పెట్టుకుంటున్నట్టు లేదనే చెప్పాలి.
ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా తెరాస సభ్యత్వ నమోదు కార్యక్రమం జరుగుతున్న సంగతి తెలిసిందే. పెద్దపల్లి జిల్లా మంథనిలో జరిగిన ఈ కార్యక్రమానికి మంత్రి కేటీఆర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో ఇతర రాజకీయ పార్టీలన్నీ అధోగతి పాలయ్యాయనీ, ఒక్క తెరాస మాత్రమే తెలంగాణలో మిగిలి ఉందన్నారు. తెలుగుదేశం పార్టీ కూడా రాష్ట్రం నుంచి ఖాళీ చేయాల్సిందేననీ, తెలంగాణ దెబ్బకి చంద్రబాబు నాయుడు ఎప్పుడో పారిపోయారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీ కథ కూడా ఇంతేనన్నారు. నిజానికి, కాంగ్రెస్ పార్టీని ఎప్పుడో రద్దు చేయాలని నాడు మహాత్మా గాంధీ సూచించారని గుర్తు చేశారు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పై తీవ్ర వ్యతిరేకత ఉందన్నారు. వారు చేసినన్ని కుంభకోణాలు ఎవ్వరూ చేయలేదన్నారు.
తెలంగాణలో అభివృద్ధిని అడ్డుకోవడమే కాంగ్రెస్ లక్ష్యంగా పెట్టుకుందని కేటీఆర్ ఆరోపించారు. పేదల ముఖాల్లో చిరునవ్వుల కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ శ్రమిస్తున్నారనీ, అందుకే భారీ ఎత్తున ప్రాజెక్టులు చేపడుతున్నారని అన్నారు. అయితే, వీటిని అడ్డుకోవడమే కాంగ్రెస్ లక్ష్యంగా పెట్టుకుందని కేటీఆర్ మండిపడ్డారు.
కేటీఆర్ మాటల్ని జాగ్రత్తగా గమనిస్తే… కాంగ్రెస్ ను అడ్డుకునేందుకు తెరాస ఆశ్రయించిన వ్యూహం ఏంటో అర్థమైపోతోంది. నిజానికి, ఇటీవలి కాలంలో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి కాస్త ఊపు వచ్చిందనే సూచనలు కనిపించాయి. రాష్ట్రంలో పెరుగుతున్న ప్రభుత్వ వ్యతిరేకతను బాగానే ఒడిసిపట్టుకుంటోందనే అభిప్రాయం వ్యక్తమైంది. అంతేకాదు, కొన్ని సర్వేల ఫలితాలు అంటూ కేసీఆర్ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నమూ చూసింది. ఇలా కాస్త దూకుడు మీదున్న కాంగ్రెస్ ను అడ్డుకోవాలంటే… మరోసారి తెలంగాణ ఎమోషన్స్ ను వాడుకోవాల్సిందే! తెలంగాణ ప్రజలకు ఈ ప్రాంత పార్టీ మాత్రమే కావాలీ… ఇతర పార్టీలు ఆదరించకూడదనే సిద్ధాంతాన్ని నెమ్మదిగా ఇంజెక్ట్ చేసేందుకు కేటీఆర్ ప్రయత్నిస్తున్నట్టున్నారు. గతంలో ఉద్యమ పార్టీగా తెరాస ఏం చేసిందో.. అధికారంలోకి వచ్చిక కూడా ఇంకా అదే చేస్తోంది.