తెలంగాణ రాష్ట్ర సమితికి ఎన్నికలు దగ్గర పడే కొద్దీ కొత్త కొత్త సమస్యలు వస్తున్నాయి. అయితే ఈ సమస్యలు కోరి తెచ్చుకుంటున్నవే. పాలేరు నుంచి తాండూరు వరకూ ఇలాంటి సమస్యలు ఉన్నాయి. 2014 అసెంబ్లీ ఎన్నికల తర్వాత 2018 ముందస్తు అసెంబ్లీ ఎన్నికలకు ముందు టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆపరేషన్ ఆకర్ష్ ప్రయోగించారు. పెద్ద ఎత్తున ఎమ్మెల్యేల్నీ పార్టీలో చేర్చుకున్నారు. అయితే అలా చేరిన నియోజకవర్గాల్లో బలమైన నేతలు ఉన్నారు. వారికి ఇప్పుడు ఎటూ అవకాశం కల్పించలేని పరిస్థితి. అవకాశం కల్పిస్తే పార్టీలో చేరిన ఎమ్మెల్యేలకు హ్యండివ్వాలి. వారి కోసం సీనియర్ నేతలను బలిస్తే మొదటికే మోసం వస్తుంది.
ఎన్నికలు దగ్గర పడుతూండటంతో తాండూరులో తానే పోటీ చేస్తానని మాజీ మంత్రి మహేందర్ రెడ్డి రెడీ అయ్యారు . తాండూరు ఆయనకు కంచుకోట. గత ఎన్నికల్లో స్వల్ప తేడాతో కాంగ్రెస్ అభ్యర్థి రోహిత్ రెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. కానీ రోహిత్ రెడ్డిని టీఆర్ఎస్లో చేర్చుకున్నారు. ఇప్పుడు టిక్కెట్ తనకేనని.. ఆ హామీ మేరకే పార్టీలో చేరానని రోహిత్ రెడ్డి అంటున్నారు. ఇలాంటి నియోజకవర్గాలు చాలా ఉన్నాయి. కొల్లాపూర్ ఎమ్మెల్యే కూడా కాంగ్రెస్ నుంచి గెలిచినవారే. అక్కడ కీలక నేత జూపల్లి కృష్ణారావు పార్టీ మారేందుకు రెడీ అయ్యారు. ఇక పాలేరులో నామా నాగేశ్వరరావు రేపుతున్న కలకలం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.
ఇలా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పార్టీలో చేరిన ప్రతీ నియోజకవర్గంలో వివాదాలున్నాయి. అంతే కాదు గతంలో నిర్వహించిన ఆపరేషన్ ఆకర్ష్‌లో పార్టీలో చేరిన అనేక మంది ప్రముఖులు ఇప్పుడు అవకాశాల కోసం ఎదురు చూస్తున్నారు. ఓ రకంగా ఇప్పుడు టీఆర్ఎస్ ఓవర్ లోడ్ అయింది. గతంలో ఎవరూ బయటపడలేదు. కానీ ఇప్పుడు బయటపడటానికి అవకాశం ఉంది. ఎందుకంటే బలమైన ప్రత్యామ్నాయాలు కళ్ల ముందు కనిపిస్తున్నాయి. అందుకే టీఆర్ఎస్కు చేరికల సైడ్ ఎఫెక్టులు ఎక్కువగానే ఉండే అవకాశం కనిపిస్తోంది.