తెలంగాణలో భారతీయ జనతా పార్టీ సొంతంగా ఎదగాలని భావిస్తోంది. జాతీయ అధ్యక్షుడు అమిత్ షా సూచనలూ, సలహాలూ, ఫార్ములా మేరకు కేసీఆర్ సర్కారు వైఫల్యాలను ఎండగట్టేస్తాం అని రాష్ట్ర భాజపా నేతలు అంటున్నారు. రాష్ట్రం అన్ని రకాలుగా అభివృద్ధి చెందాలంటే భాజపా అధికారంలోకి రావాలంటూ ప్రచారం చేస్తున్నారు. రాష్ట్రంలో తామే తెరాసకు ప్రత్యామ్నాయం అంటున్నారు. ఇది రాష్ట్రస్థాయి భాజపా వైఖరి..! ఇక జాతీయ స్థాయికి వెళ్లేసరికి… అంటే, ఢిల్లీ స్థాయిలో తెరాసపై భాజపా వైఖరి మరోలా కనిపిస్తోంది..!
అంతేకాదు, కేంద్ర ప్రభుత్వంతో ముఖ్యమంత్రి కేసీఆర్ డీల్ చేస్తున్న విధానమూ ఈ మధ్య అందరూ చూస్తున్నదే. తాజాగా, రాజ్యసభ ఉపాధ్యక్ష ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థికి తెరాస మద్దతు ప్రకటించింది! అంటే, అది భాజపాకి మద్దతు ఇచ్చినట్టు కాదనే లాజిక్ తో తెరాస నేతలు మాట్లాడొచ్చు. కేసీఆర్ కి నితీష్ కుమార్ ఫోన్ చేశారు కాబట్టి, అందుకే జేడీయు అభ్యర్థి హరివంశ్ నారాయణ్ సింగ్ కి తాము మద్దతు ఇచ్చారనే లెక్కల్లో సమర్థించుకోవచ్చు. ఇలాంటి కోణాలు ఎన్నైనా తీసుకోవచ్చుగానీ… ఢిల్లీ స్థాయికి వచ్చేసరికి మోడీ వెర్సెస్ కేసీఆర్ అనే వాతావరణమైతే లేదన్నది చాలా స్పష్టంగా కనిపిస్తున్న విషయం.
దీని వల్ల తెలంగాణలో తెరాసపై పడే ప్రభావం కంటే, రాష్ట్రస్థాయిలో భారతీయ జనతా పార్టీకే నష్టం ఎక్కువగా కనిపిస్తోంది. ఇక్కడి నేతలు బస్సు యాత్రలు చేస్తూ, కేసీఆర్ కి వ్యతిరేకంగా రోజుకొక పోస్టర్లు విడుదల చేస్తూ… ఇలా తమకు ప్రత్యర్థి పక్షం తెరాస అనే రేంజిలో పోరాటాలు చేస్తున్నారు. అయితే, జాతీయ స్థాయికి వచ్చేసరికి.. రాష్ట్రంలో పార్టీ నేతల పోరాటాన్ని సీరియస్ గా తీసుకుంటున్నట్టు కనిపించడం లేదు. తెరాస విషయంలో జాతీయ స్థాయిలో ఒక స్పష్టత లేదన్నట్టుగానే పరిస్థితి ఉంది. లేదంటే, తెరాసతో మోడీ డీల్ చేసే విధంగా మరోలా ఉండేది!
ప్రస్తుత రాజ్యసభ డెప్యూటీ ఛైర్మన్ ఎన్నికలే తీసుకుంటే… నితీష్ కుమార్ ద్వారా ఫోన్ కేసీఆర్ కు వెళ్లిందంటున్నారు! నిజానికి, ఈ మధ్య కేసీఆర్ ఢిల్లీ టూరులోనే ప్రధానితో భేటీ సందర్భంగా ఈ అంశం కూడా చర్చకు వచ్చిందనే ఊహాగానాలు అప్పుడు వినిపించాయి. సరే, ఏదేమైనా తెరాస విషయంలో మోడీ అనుసరిస్తున్న వైఖరిలో స్పష్టత లోపించడంతో.. రాష్ట్రస్థాయిలో భాజపా చేస్తున్న కార్యక్రమాల్లో తీవ్రతను ప్రజలు ఫీలయ్యే అవకాశం తగ్గిపోతోంది. తెరాసపై భాజపా కొట్లాటలో తీవ్రత దాదాపు తగ్గుతున్నట్టుగానే తాజా పరిణామాల ద్వారా వ్యక్తమౌతున్న అభిప్రాయం.