గడచిన వారం రోజులుగా భాజపా ఎంపీ బండి సంజయ్ కొన్ని తీవ్రమైన వ్యాఖ్యలే చేస్తూ వస్తున్నారు. అయితే, వాటికి ఏమంత ప్రాధాన్యత దక్కలేదనే చెప్పాలి. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు అంటూ కొన్ని ఛానెల్స్ బ్రేకింగ్ న్యూసులు వేసినా, ఆ స్థాయిలో స్పందన ఎక్కడా కనిపించలేదు. ఈ వ్యాఖ్యల మీద తెరాసగానీ, కాంగ్రెస్ పార్టీగానీ పెద్దగా పట్టించుకున్నట్టూ కనిపించలేదు. స్పందించకపోతే చర్చ ఎలా అవుతుందీ, కాదు కదా? అందుకే, పదేపదే ఆ ప్రయత్నం చేసీచేసీ చివరికి అనుకున్నది సాధించారు బండి సంజయ్. ఆయన చేసిన వ్యాఖ్యలపై తెరాస, కాంగ్రెస్ పార్టీలు ఎట్టకేలకు స్పందించాయి.
సి.ఎ.ఎ.ని వ్యతిరేకస్తున్నవారిని పాకిస్థాన్ పంపిస్తామన్నాని సంజయ్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ద్రోహులారా ఖబడ్దార్.. మీరు రాళ్లు పట్టుకుని వస్తే మేం బాంబులతో వస్తాం. మీరు కర్రలతో సిద్ధమైతే.. మేం కత్తులు తీస్తాం. మీరు రాకెట్లు తీస్తే, మేం లాంఛర్లు ప్రయోగిస్తాం. యుద్ధం ప్రారంభమైంది, ఎవ్వర్నీ వదిలేదు లేదు. మున్సిపల్ ఎన్నికల్లో తెరాసకు ఓటేస్తే మజ్లిస్ పార్టీకి వేసినట్టే, దేశాన్ని ముక్కలు చేయాలని కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్టు పార్టీలు చూస్తున్నాయంటూ సంజయ్ అన్నారు. ఈ స్థాయి విమర్శలు చేయడంతో ఆ రెండు పార్టీలు స్పందించేశాయి.
తెరాస నేత గంగుల కమలాకర్ మాట్లాడుతూ… భావోద్వేగాలను రెచ్చగొట్టి ఎన్నికల్లో లాభపడాలని భాజపా నేతలు ప్రయత్నిస్తున్నారనీ, ఇలాంటి వ్యాఖ్యలు సరైనవి కాదన్నారు. హిందువులు, ముస్లింల మధ్య చిచ్చుపెట్టాలని ఆయన ప్రయత్నిస్తున్నారన్నారు. సత్తా ఉంటే ఎన్నికల్ని నేరుగా ఎదుర్కోవాలంటూ సంజయ్ కి సవాల్ చేశారు. కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ స్పందిస్తూ… ఏమిట్రా బాబూ నీ భాష అంటూ సంజయ్ ని ప్రశ్నించారు. ప్రజలు నిన్ను ఎన్నుకున్నది బాంబులు వెయ్యడానికా, కత్తులు తియ్యడానికా, ప్రజల్ని భయభ్రాంతులకు గురి చెయ్యడానికా అన్నారు. ఇదేనా నీ సంస్కారమంటూ మండిపడ్డారు. ఇది చాలు కదా.. ఇప్పుడు ఈ వ్యాఖ్యలపై మరోసారి సంజయ్ స్పందిస్తారు, అప్పుడు మరోసారి ఆ రెండు పార్టీల నేతలూ మళ్లీ విమర్శిస్తారు. ఇది నిరంతర ప్రక్రియ. తెరాస, కాంగ్రెస్ పార్టీలతో సమస్థాయిలో తలపడుతున్నామని చాటి చెప్పాలంటే ఇలాంటి చర్చలు తెర మీద ఉంచితే అనుకుంటున్నారేమో? అంతిమంగా జరిగేదీ ఒరిగేదీ ఏముంటుందనేది ఈ సందర్భంలో అనవసర చర్చ?