ఫిబ్రవరి 2న జి.హెచ్.ఎం.సి. ఎన్నికలు జరుగుతాయి. అవి జరిగిన పదిరోజులకే మళ్ళీ ఫిబ్రవరి 13 మెదక్ జిల్లాలోని నారాయణఖేడ్ ఉప ఎన్నికలు జరుగబోతున్నాయి. మంత్రి కె.టి.ఆర్. గ్రేటర్ ఎన్నికలకి తెరాస రధసారధిగా బాధ్యతలు నిర్వహిస్తుంటే, మంత్రి హరీష్ రావుకి నారాయణఖేడ్ ఉప ఎన్నికలలో తెరాసను గెలిపించే బాధ్యత అప్పగించబడింది. కనుక ఆయన అప్పుడే నారాయణఖేడ్ లో ఎన్నికల ప్రచారం మొదలుపెట్టేసారు.
ఆదివారం నాడు నారాయణఖేడ్ లో ఏర్పాటు చేసిన ఒక సభలో చంద్రబాబు నాయుడుపై ఆయన నేరుగా విమర్శలు చేసారు. ఆయన తెలంగాణా రాష్ట్ర అభివృద్ధికి అడ్డంకులు సృష్టిస్తున్నారని, తెలంగాణా తెదేపా నేతలు నిసిగ్గుగా ఆయన ఆదేశాలను పాటిస్తూ, రాష్ట్ర ప్రయోజనాలకు నష్టం కలిగి విధంగా వ్యవహరిస్తున్నారని హరీష్ రావు ఆరోపించారు. ఈ సందర్భంగా ఆయన కాంగ్రెస్ నేతలపై కూడా తీవ్ర విమర్శలు చేసారు.
నారాయణ ఖేడ్ ఉపఎన్నికలలో ఆ రెండు పార్టీలు తమ ప్రధాన ప్రత్యర్ధులు గాబట్టి ఆయన వాటిని విమర్శించడం చాలా సహజమే. కానీ ఒక రాజకీయ పార్టీ అయిన తెదేపాను తెలంగాణా నుండి తుడిచి పెట్టేస్తామని చెప్పడం ద్వారా తెదేపా పట్ల తమ పార్టీ వైఖరిలో ఎటువంటి మార్పు లేదని మళ్ళీ మరోమారు పునరుద్ఘాటించినట్లయింది. 2014సార్వత్రిక ఎన్నికలలో తెరాస విజయం సాధించిన తరువాత మళ్ళీ వచ్చే ఎన్నికల నాటికి తెలంగాణా రాష్ట్రం నుండి తెదేపాను సమూలంగా తుడిచిపెట్టేస్తామని ఆయన ప్రతిజ్ఞ చేసారు. సుమారు ఏడాదిన్నరగా తెరాస పార్టీ అదే పనిలో ఉంది. మున్ముందు కూడా అదే పనిమీద ఉంటుందని హరీష్ రావు మాటలు స్పష్టం చేస్తున్నాయి.
గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో మంత్రి కె.టి.ఆర్. కూడా అదేవిధంగా మాట్లాడారు. అంతే కాదు తెలంగాణా తెదేపా నేతలు మనసులో మాటలను ఆయన బయట పెట్టారు. “ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు కూడా ఇప్పుడు తెలంగాణాలో తన పార్టీని పట్టించుకోవడం లేదు. కనుక తెలంగాణా నుండి తెదేపా అదృశ్యం కావడానికి మరెన్నో రోజులు పట్టదు. ఇక తెలుగుదేశం పార్టీ ఆంధ్రాకే పరిమితమయిపోతుంది,” అని జోస్యం చెప్పారు.
తెరాస నేతలు ఇంత బహిరంగంగా, నిర్భయంగా తెదేపా పట్ల తమ వైఖరిని చాటి చెపుతున్నా కూడా తెదేపాను ఇరుగు పొరుగు రాష్ట్రాలకు కూడా విస్తరించి జాతీయపార్టీగా మలచాలనుకొన్న ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అసలు పట్టుంచుకోకపోవడం చాలా విచిత్రంగా ఉంది. కారణాలు ఎవయితేనేమి చంద్రబాబు నాయుడు జి.హెచ్.ఎం.సి. ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉంటున్నారు. తెదేపా-బీజేపీలు కలిసి నిజాం కాలేజి మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన పాల్గొనప్పటికీ, తెరాస పార్టీని, ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి కేసీఆర్ ని విమర్శించకుండా చాలా జాగ్రత్తగా ప్రసంగించారు. తద్వారా తెరాస, తెలంగాణా ప్రభుత్వం, దాని ముఖ్యమంత్రి కేసీఆర్ పట్ల మెతకవైఖరినే అవలంభించదలచినట్లు హైదరాబాద్ కి వచ్చి స్వయంగా చాటింపు వేసినట్లయింది.కనుక తెలంగాణా తెదేపా నేతలు తెరాసతో, ముఖ్యమంత్రి కేసీఆర్, ఆయన ప్రభుత్వంపై ఎంతగా విమర్శలు గుప్పించినా, ఎంతగా పోరాడిన దాని వలన ఎటువంటి ప్రయోజనమూ ఉండకపోవచ్చును.
తెదేపా గురించి తెరాస నేతలు చెపుతున్న జోస్యమే ఏదో ఒకనాడు నిజమయ్యే అవకాశాలు ఉన్నాయని భావించవలసి ఉంటుంది. తెలంగాణాలో తన పార్టీ తుడిచిపెట్టుకొనిపోతున్నప్పటికీ చంద్రబాబు నాయుడు దానిని కాపాడుకొనే ప్రయత్నాలు చేయదలచుకోనప్పుడు, పార్టీని ఇతర రాష్ట్రాలకు విస్తరించడం గురించి ఆలోచన చేయడం కూడా అనవసరమేనని చెప్పవచ్చును. అటువంటప్పుడు జాతీయ కమిటీ ఏర్పాటు కూడా అనవసరమేనని చెప్పక తప్పదు.
నారాయణ ఖేడ్ ఎన్నికల షెడ్యూల్:
నారాయణ్ ఖేడ్ఉప ఎన్నికలకు నోటిఫికేషన్ జనవరి 20న వెలువడుతుంది. ఆ రోజు నుండి జనవరి 27వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. జనవరి 28న నామినేషన్లను పరిశీలిస్తారు. జనవరి 30 నామినేషన్ల ఉపసంహరణకి ఆఖరి రోజు. ఫిబ్రవరి 13న పోలింగ్ నిర్వహించి, 16న ఓట్ల లెక్కింపు చేసి అదే రోజున ఫలితాలు వెల్లడిస్తారు.